యూపీ ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేయనున్న సమాజ్‌వాదీ పార్టీ | Samajwadi Party to release its first manifesto for UP Assembly polls tomorrow | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేయనున్న సమాజ్‌వాదీ పార్టీ

Nov 25 2026 9:23 PM | Updated on Nov 25 2026 9:23 PM

Samajwadi Party to release its first manifesto for UP Assembly polls tomorrow

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాజ్‌వాదీ పార్టీ తొలి ఎన్నికల మేనిఫెస్టోను నవంబర్ 26న విడుదల చేయనుంది. యువత, విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహిళలు, బాలికల సంక్షేమంపై ప్రత్యేకంగా మరో మేనిఫెస్టోను కొన్ని వారాల తర్వాత విడుదల చేయనుంది. జనవరి నాటికి రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకు ప్రత్యేక పత్రాలను సిద్ధం చేయాలని పార్టీ భావిస్తోంది.

తొలి మేనిఫెస్టోలో దళితుల సమస్యలు, శాంతిభద్రతలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అంశాలనూ ప్రాధాన్యంగా చేర్చనున్నారు. నవంబర్ 21న జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. మూడు రకాల మేనిఫెస్టోలు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోతో పాటు మహిళల కోసం ప్రత్యేక పత్రం, జిల్లాల వారీగా మరో పత్రాన్ని తీసుకొస్తామని చెప్పారు.

వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలిపి పీడీఏ రాజకీయ ప్రాతిపదికగా పార్టీ సామాజిక న్యాయ విధానాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ప్రజల జీవితాల్లో విద్య, ఉపాధి, ఆదాయం, భద్రత, అవకాశాలకు సంబంధించిన అవసరాలను మేనిఫెస్టో ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2022 ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలకు గత ఐదేళ్లలో చోటుచేసుకున్న మార్పులు, కొత్త సవాళ్లను జోడిస్తూ పలుమాసాల పాటు సంప్రదింపులు, పరిశోధనలతో ఈ పత్రాన్ని సిద్ధం చేశారు.

యువత, రైతులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, మేధావులు, అణగారిన వర్గాల నుంచి సూచనలు తీసుకున్నారు. న్యాయవాదులు, మాజీ సైనికులు, మీడియా రంగానికి చెందినవారికి సంబంధించిన సంక్షేమ ప్రతిపాదనలూ ఇందులో ఉండనున్నాయి. అఖిలేశ్ యాదవ్ చేపట్టిన ‘విజన్ ఇండియా’ కార్యక్రమం కూడా మేనిఫెస్టో రూపకల్పనకు దోహదపడింది. ఈ కార్యక్రమంలో ఆయన ఉత్తరప్రదేశ్‌తో పాటు బెంగళూరు వంటి ఇతర ప్రాంతాల్లో యువత, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

రైతులకు సకాలంలో చెల్లింపులు 
వ్యవసాయ రుణాల మాఫీ, 100 శాతం ఉచిత విద్యుత్, సాగునీటి కోసం కాలువల నీరు, పంటల బీమా, పంటలకు హామీ ధర, చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు వంటి ప్రతిపాదనలు ఆర్థిక, ఉపాధి విధానాల్లో ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టడం, దాని ద్వారా జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యం, రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడం వంటి అంశాలను కూడా పార్టీ పరిశీలిస్తోంది. 2005 తర్వాత ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకాన్ని తిరిగి ప్రారంభించడం వంటి ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది.

పేదలకు అర్హత కార్డు అవసరం లేకుండా ఉచిత వైద్య చికిత్స, స్వయం ఉపాధికి ఆర్థిక సాయం, గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను అఖిలేశ్ గతంలో ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ, వాతావరణ మార్పుల అంశాలకూ మేనిఫెస్టోలో చోటు కల్పించనున్నారు. 2027 ఎన్నికలకు చాలా ముందుగానే మేనిఫెస్టోలను విడతలవారీగా విడుదల చేయడం గత ఎన్నికలతో పోలిస్తే సమాజ్‌వాదీ పార్టీ వ్యూహంలో మార్పు. 

ఈ సారి తమ హామీలను వివిధ వర్గాలకు వివరించేందుకు, ప్రజల అభిప్రాయాలు తీసుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని పార్టీ భావిస్తోంది. మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా విడుదల చేయనున్న రెండో మేనిఫెస్టోలో సంక్షేమం, భద్రత, సాధికారత, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉండనున్నాయి. ఈ విడతలవారీ ప్రకటనలతో 2027 ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించేందుకు సమాజ్‌వాదీ పార్టీ తన రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement