చికెన్‌ షవర్మా తిని.. 43 మందికి అస్వస్థత | Bhiwandi: 43 Fall ill After Chicken Shawarma Eating | Sakshi
Sakshi News home page

చికెన్‌ షవర్మా తిని.. 43 మందికి అస్వస్థత

Nov 25 2026 8:15 PM | Updated on Nov 25 2026 8:20 PM

Bhiwandi: 43 Fall ill After Chicken Shawarma Eating

భివండీ: చికెన్‌ షవర్మా తిని 43 మంది అస్వస్థతకు గురయిన ఘ‌ట‌న మ‌హ‌రాష్ట్ర‌లోని భివండీలో జ‌రిగింది. బాధితుల్లో 17 మంది పురుషులు, 16 మంది మ‌హిళ‌లు, 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఓ గర్భిణి కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భివండీ న‌గ‌రంలోని వంజార్‌పట్టి నాకా ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో సోమవారం రాత్రి షవర్మా తిన్నవారిలో కొంద‌రు మంగళవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు, వికారంతో ఆస్ప‌త్రిపాల‌య్యారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బాధితులు చికిత్స కోసం స్వర్గీయ ఇందిరాగాంధీ స్మతి ఉపజిల్లా ఆసుపత్రిలో చేరారు. షవర్మా తినడం వల్లే వీరికి అనారోగ్యం తలెత్తినట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఆ తరువాత ప‌లువురు బాధితులు ఇదే లక్షణాలతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో బాధితులు ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ మాధవి పందారే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన‌ షవర్మా దుకాణాన్ని కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేశారు.

కాగా, ఈ ఏడాది జూన్‌ 15న భివండిలోని ఖండుపాడా ప్రాంతంలో చికెన్‌ షవర్మా తిని ఏకంగా 107 మంది ఫుడ్‌ పాయిజనింగ్‌ బారినపడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో భివండీ కార్పొరేషన్‌ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాలపై తనిఖీలు చేపట్టి చర్యలు ప్రారంభించారు. అయితే కొద్ది రోజులకే ఈ తనిఖీలు, చర్యలు నామమాత్రంగా మారిపోయాయి. ప్రస్తుతం న‌గ‌రంలోని పలు వీధుల్లో యథేచ్ఛగా బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా మరోసారి ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటన చోటుచేసుకోవడంతో కార్పొరేషన్‌ అధికారుల పర్యవేక్షణ, ఆహార భద్రత చర్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చ‌ద‌వండి: చెత్త ఎంత ఉంటే.. ఛార్జీ అంత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement