కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినకూడదని, కొన్ని కాంబినేషన్లు ఆరోగ్యానికి హానికరమని తరచూ చర్చ జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఓ కుటుంబానికి ఎదురైన విషాదం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రి నూడుల్స్ తిని.. టీ తాగిన కుటుంబం నిద్రపోయింది. తెల్లారేసరికి భార్యాభర్తలు, వారి ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురూ విగతజీవులుగా మారారు.
గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతం నగ్లా శ్రీ పదమ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డూ (11), మిష్టి (7), సాక్షత్ (3) మృతిచెందారు. శనివారం ఉదయం కుటుంబంలోని ఐదుగురూ మరణించినట్లు సమాచారం అందడంతో పోలీసులు, ఉన్నతాధికారులు, అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆహార భద్రతా శాఖ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మహేశ్ తల్లి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు ముందు రోజు రాత్రి నూడుల్స్ తిని.. టీ కూడా తాగారు. దీంతో ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం, ఫీల్డ్ యూనిట్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం వెల్లడికానుంది.
పుచ్చకాయ-బిర్యానీ ఘటన గుర్తుందా?
కొన్ని నెలల క్రితం ముంబైలోని పాయ్ధునీ ప్రాంతంలో ఓ కుటుంబంలో నలుగురు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అబ్దుల్లా డోకాడియా (44), ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13) మృతిచెందారు. అంతకుముందు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్నారని, ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారని వార్తలు వచ్చాయి. దీంతో బిర్యానీ, పుచ్చకాయ కలిపి తినడం వల్లే మరణాలు సంభవించాయంటూ ప్రచారం జరిగింది.
అయితే ఆ ఘటనలో ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు మరో విషయాన్ని వెల్లడించాయి. బాధితుల శరీర భాగాల్లో, వారు తిన్న పుచ్చకాయలో జింక్ ఫాస్ఫైడ్ అనే విషపదార్థం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇది ఎలుకల మందులో ఉపయోగించే అత్యంత విషపూరిత రసాయనం. దీంతో ఫుడ్ పాయిజన్ ప్రచారానికి చెక్ పడింది. ఆపై ఆహారంలో విషపదార్థం ఎలా చేరిందన్న అంశం దర్యాప్తులో కీలకంగా మారింది. ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో ఐదుగురి మరణాలు మరోసారి ఆహార భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
ఇదీ చదవండి: ధర్నాకు దిగమంటారా? సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్


