న్యాయ వ్యవస్థలో ఓ అరుదైన పరిణామం చోటుచేసుకుంది. ప్రజలకు న్యాయం అందించాల్సిన న్యాయమూర్తులే.. ఓ సమస్య పరిష్కారం కోసం నిరసనకు దిగుతామని హెచ్చరించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే అది వాడీవేడిగా సాగుతున్న తాజా పరిణామాలపై మాత్రం కాదు.
ఫుట్‌పాత్ లేదు.. రోడ్డు దాటేందుకు క్రాసింగ్ లేదు.. పాదచారుల భద్రతపై అధికారుల నిర్లక్ష్యానికి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన గేటు వద్ద సమస్య పరిష్కారం కాకపోతే తామే రంగంలోకి దిగుతామని న్యాయమూర్తులు హెచ్చరించారు. తదుపరి విచారణలోగా పనులు పూర్తి చేయకపోతే అక్కడే బైఠాయించి ధర్నా చేపడతామని స్పష్టం చేశారు.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పాదచారుల సమస్యపై అధికారుల తీరును తప్పుబట్టింది. అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ఉద్దేశించి.. సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీ హైకోర్టు గేటు వద్ద ధర్నాకు దిగుతామని, పని పూర్తయ్యే వరకు ఇంటికి వెళ్లబోమని వ్యాఖ్యానించింది. అవసరమైతే ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించింది.
పాదచారుల భద్రత ప్రాథమిక హక్కు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, ఆర్టికల్ 19(1)(d)లోని సంచార స్వేచ్ఛలో సురక్షితంగా నడిచే హక్కు కూడా భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని, విద్యుత్ స్తంభాలు, చెత్త, అక్రమ పార్కింగ్ వంటి అడ్డంకులను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణను రహదారుల అభివృద్ధిలో తప్పనిసరి అంశంగా పరిగణించాలని పేర్కొంది.
దేశంలోని ఐదు నగరాల్లో ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని, భద్రతా తనిఖీలు నిర్వహించాలని, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. వాహనాల రాకపోకలకే ప్రాధాన్యమివ్వకుండా.. ప్రజలు సురక్షితంగా నడిచేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: మోదీ గద్దె దిగాలి.. అదీ ప్రజాస్వామ్యబద్ధంగానే: ప్రకాశ్ రాజ్


