బంగ్లా, నేపాల్‌తో భారత్‌ను పోల్చొద్దు
మోదీజీ.. మీ హర్ ఘర్ తిరంగా ఏమైంది?
కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాలన్న తమ లక్ష్యం ప్రజాస్వామ్యబద్ధంగానే నెరవేరుతుందని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. భారత్ బంగ్లాదేశ్, నేపాల్ కాదని.. మనకు రాజ్యాంగం, ఓటు హక్కు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ మార్పు కోసం ఎన్నికల ద్వారానే పోరాడతామని, ఉత్తరప్రదేశ్ నుంచి 2029 లోక్‌సభ ఎన్నికల వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
‘‘మనం నేపాల్ కాదు.. బంగ్లాదేశ్ కాదు. మనకు అంబేడ్కర్ ఉన్నారు, గాంధీ ఉన్నారు.. భగత్‌సింగ్ ఉన్నారు. మనకు రాజ్యాంగం ఉంది. ఓటు హక్కు ఉంది’’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. శాంతియుత నిరసనలు, ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చాలని కోరడం అరాచకం కాదని.. ప్రజలు తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటున్నారని వివరించారు.
నిరసనకారులపై బలప్రయోగం ఎందుకు?
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను తిరంగా మార్చ్‌కు ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిరసనలు చేపడుతోంది.
నిరసనకారులతో చర్చలు జరపకుండా బలప్రయోగానికి దిగడం వల్లే ప్రభుత్వాన్ని మార్చాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. తాము ఆయుధాలతో పోరాడటం లేదని, రాజ్యాంగం, నిరసన తెలిపే హక్కే తమ ఆయుధాలని వ్యాఖ్యానించారు. మహిళలతో సహా నిరసనకారులపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఈ అంశాన్ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తాలని కోరారు.
‘హర్ ఘర్ తిరంగా’ నినాదం ఏమైంది?
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపును ప్రస్తావిస్తూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు సంధించారు. “మోదీజీ.. మీ హర్ ఘర్ తిరంగా నినాదం ఏమైంది? దేశ యువత త్రివర్ణ పతాకంతో ర్యాలీగా వెళ్లాలని కోరుకుంటోంది” అని అన్నారు. శాంతియుతంగా జాతీయ జెండాతో నిరసన తెలిపే హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా, పౌర సమాజ సంఘాల నుంచి నిరసనలకు మద్దతు లభిస్తోందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిరసన తెలపడం, ఓటు ద్వారా మార్పు కోరడం పౌరుల హక్కులని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దీప్కే జాడపై సీజేపీ ఆందోళన


