కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని.. పైగా ఇది వరకు ఆయన సమర్పించిన బాండ్‌ను సైతం ఉల్లంఘించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో తిరంగా యాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన ఆయన్ని, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
సర్ ప్రక్రియకు, సీఈసీకి వ్యతిరేకంగా అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద ర్యాలీకి సీజేపీ పిలుపు ఇచ్చింది. అయితే ఢిల్లీ పోలీసుల కట్టుదిట్టమైన ముందస్తు చర్యలతో ఆ ప్రయత్నం భగ్నమైంది. పైగా సీజేపీ కీలక నేతలను విమానంలోనే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలేవీ చేయమంటూ వాళ్లతో సంతకాలు చేయించుకుని.. రూ.50 వేల వ్యక్తిగత బాండ్ మీద పోలీసులు వాళ్లను రిలీజ్ చేశారు. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద మరోసారి ధర్నా చేపడతామని సీజేపీ ప్రకటించింది. అయితే ఈలోపు అనూహ్యంగా..
జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధిస్తూ కేంద్ర హోం శాఖ, ఢిల్లీ పోలీసులు ప్రకటన చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ సీజేపీ కోర్ కమిటీ సభ్యులు జాతీయ జెండాలతో జంతర్ మంతర్ బారికేడ్లు దూకి లోపలికి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయసి కోర్టులో ప్రవేశపెట్టగా.. జ్యూడీషియల్ రిమాండ్ మీద తిహార్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు కనిపించాయి.
ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ పేరిట త్రివర్ణ పతాక ప్రదర్శన, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాలని సీజేపీ భావించింది. అయితే పోలీసులు ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను అరెస్ట్ చేశారు.
దీప్కే ఆచూకీపై సీజేపీ ఆందోళన
దీప్కేను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. ‘ఢిల్లీ పోలీసులు అభిజీత్ దీప్కేను తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆయనతో మాకు సంబంధాలు తెగిపోయాయి. న్యాయవాదులతో మాట్లాడేందుకు అనుమతించడం లేదు’ అని సీజేపీ పేర్కొంది. జాతీయ జెండా చేతబట్టి ఇంటి నుంచి బయటకు రావడం ఎలా నేరమవుతుందని ప్రశ్నించింది. యువతను ఉగ్రవాదుల్లా ఎందుకు చూస్తున్నారని నిలదీసింది. ఇలాంటి చర్యలతో నిరసనల్లో పాల్గొనేవారిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించింది.
సీజేపీ న్యాయ విభాగానికి చెందిన రత్నా సింగ్ కూడా దీప్కే అరెస్ట్‌పై స్పందించారు. ఆయనను అరెస్ట్ చేసి ఎస్ఈఎం ఎదుట హాజరుపరచనున్నారని సమాచారం మాత్రం ఉందని అంటున్నారు. అయితే, దీప్కే ఆచూకీ ఇంకా తెలియలేదని, న్యాయవాదులు సైతం ఆయనను కలవలేకపోయారని పేర్కొన్నారు.
పోలీసులకు సీజేపీ నేత లేఖ
దీప్కే ఎక్కడ ఉన్నారు? ఏ చట్ట నిబంధనల కింద ఆయనపై చర్యలు తీసుకున్నారు? నిర్బంధానికి ఆదేశించిన అధికారి ఎవరు? ఆయన కస్టడీకి బాధ్యత వహిస్తున్నది ఎవరు? అనే వివరాలు వెల్లడించాలని కోరుతూ సీజేపీ నేత రోహన్ దేశ్‌పాండే ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. దీప్కేను ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారనే విషయంపై తమకు సమాచారం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆయన ఆచూకీని వెల్లడించడంతో పాటు సహచరులతో మాట్లాడేందుకు, న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
నేహా బోరా విడుదల
దీప్కేతో పాటు అరెస్టైన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు విడుదల చేశారు. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత ఆమెను విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే నేహాను మంగోల్‌పురిలోని యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఒంటరిగా ఉంచారని ఏఐఎస్ఏ పేర్కొంది. నిర్బంధంలో ఉన్నప్పుడు న్యాయవాదులను, సహచరులను ఆమెతో కలిసే అవకాశం ఇవ్వలేదని ఆరోపించింది.
నేడు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద దీప్కేపై చర్యలు తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కారణంతో ముందస్తు నిర్బంధ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయనను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దన్న బాండ్ నిబంధనలను దీప్కే ఉల్లంఘించారని పోలీసులు చెబుతున్నారు. అలాగే, సెంట్రల్ పార్క్‌కు వెళ్లవద్దంటూ ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చామని, అయినా వాటిని పాటించలేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఎముకలు విరగ్గొట్టగలరేమో, కానీ..


