పోలీసుల దౌర్జన్యాలపై∙రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వైదొలగాలనే డిమాండ్తో బుధవారం ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై భద్రతా బలగాలు దారుణంగా ప్రవర్తించాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరగా ఢిల్లీ పోలీసులు తిరస్కరించారన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా నిరసనలకు దిగిన వారి ఎముకలను విరగ్గొట్టగలరేమోకానీ, వారి సత్యాగ్రహాన్ని మాత్రం భగ్నం చేయలేరని రాహుల్ పేర్కొన్నారు.
హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని ఢిల్లీ పోలీసుల అమానుష చర్యలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందుకు బాధ్యులైన ప్రతి అధికారిపైనా న్యాయబద్ధంగా పోరాడుతామని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల దౌర్జన్యాలకు బలైన కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐకు చెందిన కొందరు విద్యార్థులను కలిసి మాట్లాడిన వీడియోను శుక్రవారం ఆయన ఎక్స్లోపోస్ట్ చేశారు.
‘మా విద్యార్థులపై దాడికి దిగిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. కేరళకు చెందిన అథిర, రాజస్తాన్కు చెందిన రితు తదితరులను ఢిల్లీ పోలీసులు కొట్టారు. వీరిపై కేసులు పెట్టాలని కేరళ హోం మంత్రి చెన్నితాల, రాజస్తాన్ పీసీసీ చీఫ్ దోతాస్రాను కోరాను. కేరళలో ఇప్పటికే జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది’అని రాహుల్ వివరించారు. వీటిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని, మరోసారి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడాలనుకునే అధికారులకు ఇదో గుణపాఠం అవుతుందని వ్యాఖ్యానించారు.


