breaking news
Neha Bora
-
దమ్ముంటే ఎమర్జెన్సీ విధించండి: మోదీకి దీప్కే సవాల్
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గొంతుకను అణచివేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనధికారిక ఎమర్జెన్సీని అమలు చేస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించారు. సీజేపీ కోర్ కమిటీ సభ్యుల అరెస్ట్.. రిమాండ్ల నేపథ్యంపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు న్యాయ కస్టడీకి పంపడంపై దీప్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకుంటే ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందని ఆరోపించారు.జాతీయ జెండాను ప్రదర్శించారనే ఆరోపణలతో నేతలను కస్టడీకి పంపడం ఏమిటని ప్రశ్నించారు. నిరసన తెలిపిన వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టించాలని చూస్తోందని విమర్శించారు.ఇండియా కూటమితో కలవం, కానీ..ఎన్నికల అక్రమాలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై ప్రశ్నించడంలో ఇండియా కూటమి, సీజేపీ లక్ష్యం ఒక్కటేనని దీప్కే చెప్పారు. అయితే, అందుకోసం తమ పార్టీ ఇండియా కూటమిలో చేరబోదని స్పష్టం చేశారు. సీజేపీ స్వతంత్ర ఒత్తిడి బృందంగా కొనసాగుతుందని, రాజకీయ పార్టీగా మారడం లేదంటే ఇండియా కూటమిలో విలీనం కావడం తమ ఉద్దేశం కాదని తేల్చిచెప్పారు.Nagpur, Maharashtra: CJP founder Abhijeet Dipke asserted that the Cockroach Janta Party is an independent pressure group and will continue to operate independently. #Nagpur #Maharashtra #AbhijeetDipke #CJP https://t.co/VvZ75pKuLx— The Guardian Chronicle (@gcnewsindia) October 14, 2026ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ప్రశ్నించడం, ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని కోరడం తమ పోరాటంలో భాగమని పేర్కొన్నారు. ఒక అంశంపై ప్రతిపక్ష కూటమితో అభిప్రాయాలు కలిసినంత మాత్రాన ఆ కూటమిలో చేరినట్లు కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు.‘అర్బన్ నక్సల్స్’పై రియాక్షన్సీజేపీని అర్బన్ నక్సల్స్ బృందంగా చిత్రీకరించడాన్ని దీప్కే తోసిపుచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసన తెలపడం దేశవ్యతిరేక చర్యలు కావని పేర్కొన్నారు. విమర్శించే వారిపై ముద్రలు వేసి వారి గొంతు నొక్కాలని చూడటం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయకుండా ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు, నిరసనకారులపై చర్యలు, ప్రభుత్వంపై విమర్శలు.. వీటన్నింటిపై బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారాయన.ఇదీ చదవండి: పోలీస్ బాండ్ బ్రేక్ చేసిన సీజేపీ నేతలు! -
ఫ్యాషనే ఆయుధంగా.. స్టైల్‌గా నిరసన!
ఢిల్లీలో ఎన్నికల సంఘం వైపుగా జరిగిన మార్చ్‌లో ఐసా (AISA) అధ్యక్షురాలు నేహా బోరా వన్ పీస్ జాలీ రోజర్ టీ-షర్టు నెట్టింట వైరల్‌గా మరి రకరకాల చర్చలకు దారితీసింది. సరిగ్గా అదే రోజున(అక్టోబర్ 12) లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ ఒక వినతిపత్రాన్ని సుప్రీంకోర్టులో సమర్పించేందుకు ఢిల్లీ వీధుల్లో నడుస్తూ వెళ్తున్నారు. ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (సిపిఐ-ఎంఎల్)కు అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా పెద్దగా నినాదాలు చేస్తూ తన గళాన్ని వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె సీజేపీ పిలుపు నేపథ్యంలో వన్‌పీస్ లోగో ఉన్న ఎర్ర టీ షర్టుతో కనిపించారు. అసలేంటి ఈ లోగో, దాని వెనుకున్న కథ గురించి సవివరంగా తెలుసుకుందామా..!ముఖ్యంగా ఆ వన్ పీస్ టీ సర్టుపై ఉన్న ఆంగ్ల అక్షరం "O" ఆకారంలో గుంట కళ్ల పుర్రె పైన పసుపు నారింజ రంగు టోపి ఉంటాయి. ఇది అచ్చం సముద్రపు దొంగల జెండాలతో ముడిపడి ఉన్న పుర్రె ఎముకల చిహ్నమైన జాలీ రోజర్ని తలపిస్తుంది. కానీ ఈ జెండా కేవలం దోపిడీలకు చిహ్నం కాదు. ఇది స్వేచ్ఛ (Freedom), ఆశయాలు, స్నేహం, మరియు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే తత్వానికి నిదర్శనం.అదీగాక నేహా అంతకుమునుపే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అదే టీ షర్టుని ధరించి ఒక ప్రత్యేకమైన భంగిమతో ఉన్న ఫోటోని పంచుకుంటూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కలుద్దాం అని రాశారు పోస్ట్‌లో. నిజానికి ఆమె గళం కంటే..ఆమె దుస్తులు ఎక్కువ మాట్లాడాయ్. 1997లో ప్రారంభమై, ఆ తర్వాత ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పొందిన జపనీస్ మాంగా 'వన్ పీస్'లోని స్ట్రా హాట్ పైరేట్స్ జాలీ రోజర్ చిహ్నం అందర్నీ ఆలోచనలో పడేసింది. అందుకు కారణం..నేపాల్ జెన్‌జెడ్ నిరసనల సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, యూకేలలో జరిగిన నిరసనకారుల ప్రదర్శనలలో వేలాది మంది విద్యార్థులు తమకు మెరుగైన విద్యా సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి జెండా కనపించింది. ఆ నేపథ్యంలోనే ఆ లోగోతో కూడిన టీ షర్టు రకరకాల ఊహాగానాలకు తెరతీసేలా చర్చలకు దారితీసింది. అలాగే అనేక దేశాల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ చిహ్నం కనిపించింది. విచిత్రం ఏంటంటే ఆ రోజు బోరాతో పాటు, రాజకీయవిశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ ప్రదర్శనలో చేరి, నిరసనకారులకు తమ మద్దతును తెలిపారు. ఆ నిరసనల వేళ పోలీసులు నేహాను అదుపులోకి తీసుకున్నారు, అలాగే నెట్టింట ఆ నిరసనల సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, పోలీసులు నిరసనల గుంపును చెదరగొట్టిన తీరు తెగ వైరల్ అయ్యాయి.ఆ చిహ్నం వెనుకున్న కథ..'వన్ పీస్'లో, జాలీ రోజర్ జెండా 'స్ట్రా హాట్ పైరేట్స్'కు చెందినది. దీనికి నాయకత్వం వహించేది మంకీ డి లూఫీ. అతను అవినీతిపరులైన, నిరంకుశ పాలకులను సవాలు చేసే ఒక కల్పిత కెప్టెన్. ఆ గడ్డి టోపీ అతని సిబ్బంది చిహ్నాన్ని ఒక సాధారణ పైరేట్ జెండా నుంచి వేరు చేస్తుంది. పొరుగును ఉన్న నేపాల్‌లో జరిగిన నిరసనల్లో ఈ జెండా కనిపించింది. అలాగే ఇండోనేషియాలో పౌరులు ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..కార్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్లు, నివాసాలపై ఈ చిహ్నంతో కూడిన జెండాను ఎగరువేశారు. అలాగే ఫిలిప్పీన్స్‌లో కూడా తమ ప్రభుత్వంపై ఆగ్రహంతో నిరసనకారులు ఇలాంటి గుర్తులతో కూడిన జెండానే ఎగురవేశారు. ఆ నేపథ్యంలోనే నేహా వన్‌పీస్ ఎరుపు రంగు టీ షర్ట్ హాట్‌టాపిక్‌గా మారి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె ట్రైండీ ఫ్యాషన్‌తో..నిరసన వ్యక్తం చేసిందా లేక దుస్తులు కూడా తమ గళం వినిపిస్తాయి అని చెప్పకనే చెబుతుందా అంటూ ఊహగానాలు మొదలయ్యాయి. అంతేగాదు ఒక కల్పిత కథనం నుంచి పుట్టిన ఒక చిహ్నం నిరసనకు ఉమ్మడి భాషగా మారుతోందా లేక అశాంతి నెలకొన్న వేళల్లో తమ బాధను ఈ చిహ్నం గొంతెత్తి నినదిస్తుందా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.ఇదీ చదవండి: అమెరికా రాయబారి మెచ్చిన దుర్గా పూజ..! ఆ కారణంగానే స్పెషల్.. -
ఆమె కాక్రోచ్ కాదు.. ఖట్టర్ బీజేపీ ఫ్యామిలీ నుంచి వచ్చి!
పోలీసుల చుట్టుముట్టడం.. పరుగులు.. అరెస్టులు.. నిర్బంధం.. అయినా ఆ ముఖంలో చిరునవ్వు చెదరదు! ఓ చోట పోలీసులు అడ్డుకుంటే మరోచోట ప్రత్యక్షం.. నిర్బంధంలో ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఉద్యమకారులకు సందేశం.. విడుదల కాగానే మళ్లీ నిరసన బాట! ఢిల్లీలో ఈసీ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పుడీమె పేరు మార్మోగుతోంది. ఆమె అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. ఆర్మీ కుటుంబంలో పుట్టి పెరిగి.. ఇవేం పనులు పిల్లా? అంటే.. 29 ఏళ్ల నేహా బోరా (Neha Bora) చెప్పే సమాధానం ఒక్కటే.. ‘భయం త్వరగా వ్యాపిస్తుంది. కానీ ఆశ కూడా అంతే వేగంగా వ్యాపిస్తుంది! హక్కుల కోసం నిలబడితేనే మార్పు సాధ్యమవుతుంది. అందుకు.. అడ్డంకులెదురైనా.. అరెస్టులైనా వెనక్కి తగ్గకుండా యువత తమ గొంతు వినిపించాలి’ అని. దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస నిరసనల్లో కనిపిస్తున్న నేహా.. ఆ పార్టీకి చెందిన నాయకురాలు కాదు. కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీకీ ఆమెకు సంస్థాగత సంబంధం లేదు. ఆమె అఖిల భారత విద్యార్థి సంఘం (AISA) జాతీయ అధ్యక్షురాలు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన ఆమె.. తనదైన రాజకీయ అభిప్రాయాలతో నిరసనల్లో పాల్గొంటున్నారు.ఆర్మీ కుటుంబంలో పెరిగి..ఉత్తరాఖండ్‌లో పుట్టిన నేహా.. తండ్రి భారత సైన్యంలో పనిచేయడంతో బాల్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్తెటిక్స్లో పీహెచ్డీ పరిశోధన ప్రారంభించారు. నాటకరంగం తనకు భిన్నమైన వ్యక్తుల ఆలోచనలను అర్థం చేసుకోవడంలో తోడ్పడిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2019–20లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి నిరసనలు ఆమె రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారాయి. అప్పటి నుంచి విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా హక్కులకు సంబంధించిన అంశాలపై జరిగే ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.పేపర్ లీకుల నుంచి..పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలైలో జరిగిన నిరసనల్లో నేహా చురుగ్గా పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. నిరుద్యోగం, పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు, యువత భవిష్యత్తుపై ఆందోళనలను తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. దీంతో ఆమె ప్రసంగాలు, నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.పోలీసులనే పరిగెత్తించి..తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ నిరసనలకు నేహా మద్దతుగా నిలిచారు. జంతర్ మంతర్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో.. ఆందోళనకారులు దిల్లీ హాట్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ‘దిల్లీ హాట్నే నేడు జంతర్ మంతర్’ అంటూ సోషల్ మీడియాలో సందేశం పెట్టారు.We have crossed the barricades and reached CP. https://t.co/uULrZgQaG6— Neha (@neha_aisa) October 11, 2026 పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ‘నేను నిర్బంధంలో ఉన్నా.. ఉద్యమం ఆగదు’ అంటూ వీడియో విడుదల చేశారు. ఆదివారం కూడా నిరసనల సందర్భంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ పరుగెత్తడం, బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. నిర్బంధ వాహనంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్థలం లేదని ఆమె ఓ వీడియోలో ఆరోపించారు.ఇంట్లో బీజేపీ మద్దతు.. బయట తనదైన బాట!నేహా కుటుంబ నేపథ్యం కూడా ఆసక్తికరంగా మారింది. సైన్యంలో పని చేసిన ఆమె తండ్రి బీజేపీ, మోదీ మద్దతుదారు. అలాగే తాత ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అని తెలుస్తోంది. తన కుటుంబంలో బీజేపీకి బలమైన మద్దతుదారులు ఉన్నారని స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకీయ అభిప్రాయాల విషయంలో ఇంట్లో విభేదాలు కూడా ఉన్నాయని చెప్పారు. కుటుంబ సభ్యుల రాజకీయ వైఖరికి భిన్నంగా తన అభిప్రాయాలతో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నానన్నది ఆమె ప్రస్థానంలో కనిపించే అంశం.అరెస్టుల మధ్యనూ నిరసనలకు పిలుపునివ్వడం, పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఆమెను యువతలో గుర్తింపు పొందిన ముఖంగా నిలిపాయి. అయితే, నేహా అభిప్రాయాలే దేశంలోని యువత అందరి అభిప్రాయాలని చెప్పలేం కదా!. ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తోంది. నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా, ఉద్యమకారులు తమ ఆందోళనలను అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ వివాదాల మధ్య నేహా బోరా పేరు మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఆర్మీ కుటుంబ నేపథ్యం.. నాటకరంగ అనుభవం.. విద్యార్థి ఉద్యమాల ప్రయాణం.. అరెస్టుల మధ్యనూ చెదరని చిరునవ్వు.. ఇవన్నీ ఆమెను నిరసనలకు కనిపించే ముఖంగా మార్చాయి.కొసమెరుపు: ఆదివారం నిరసనల్లో నేహా బోరాను పోలిన మరో మహిళ పోలీసులకు కనిపించడంతో ఆమెనే అసలు నేహా బోరా అనుకుని అదుపులోకి తీసుకున్నారు. కానీ అసలు నేహా బోరా మాత్రం మరోచోట, కనాట్ ప్లేస్‌లో నిరసన కొనసాగించారు. ఈ గందరగోళంపై ఆమె తన పోలికలున్న మహిళతో కలిసి దిగిన ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ‘ఇద్దరు నేహాల కథ.. ఇదేమీ వ్యూహం కాదు, యాదృచ్ఛికం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. చివరకు అసలు నేహా బోరాను విజయ్ చౌక్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.The tale of the two Nehas. Not strategy, just coincidence. 😂😂 https://t.co/aBA37Obxg3— Neha (@neha_aisa) October 11, 2026ఇదీ చదవండి: జెన్‌జీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు


