ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా
నోటీసులు రద్దు చేయాలని వినతి
బాండ్ నోటీసునూ సవాలు చేసిన నేత
న్యూఢిల్లీ: జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు దేశ పౌరులకు ఎలాంటి అనుమతీ అవసరం లేదని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరా స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండానే జాతీయ పతాకాన్ని ఎగురవేశానంటూ పోలీసులు తనకిచ్చిన నోటీసును రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి.
శాంతికి కట్టుబడతానంటూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్‌కు బాండ్ సమర్పించాలంటూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసును కూడా ఆమె సవాలు చేశారు. కోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఏకసభ్య ధర్మాసనం బోరా పిటిషన్‌పై ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. బోరాకు నోటీసుల జారీలో పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కారని ఆమె తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఆరోపించారు.
ప్రభుత్వ మార్పిడికి బోరా డిమాండ్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) చేతన్ శర్మ వెలిబుచ్చిన అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ప్రజాస్వామిక వ్యవస్థలో అలాంటి డిమాండ్ తప్పే కాదు. అయితే బోరా ఆ వ్యాఖ్యలు చేయలేదు’’అన్నారు. వాటిపట్ల ఏఎస్‌జీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘బోరా ఆ వ్యాఖ్యలు చేశారు. ఆమెతో పాటు ఇతర నిరసనకారులు పాల్గొన్న సదరు ప్రెస్ మీట్‌లో శంకరనారాయణన్ కూడా ఉన్నారు’’అంటూ గుర్తు చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పిడి ఓట్ల ద్వారానే జరుగుతుంది తప్ప ఢిల్లీ నడిబొడ్డులో విచ్చిన్న శక్తులు పాల్పడే నిరసనల ద్వారా కాద’న్నారు.
నేడు తీర్పు
ఇరు వర్గాల వాదనల అనంతరం, పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెలువరిస్తానని న్యాయమూర్తి పేర్కొన్నారు. బోరాకు నోటీసుల విషయమై అప్పటిదాకా ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని పోలీసులకు సూచించారు. శాంతికి భంగం కలిగించబోనని హామీపత్రం రాసిస్తే ఆమెపై తదుపరి చర్యలను నిలిపేసేందుకు అభ్యంతరమేమీ ఉండబోదని ఏఎస్‌జీ తెలిపారు. దాంతో న్యాయమూర్తి స్పందిస్తూ, ‘తాను చెడ్డదాన్నంటూ తొలుత ముద్ర వేసి, ఇప్పుడేమో బుద్ధిమంతురాలిగా ఉంటానంటూ హామీ కోరుతున్నారన్నది బోరా ఆక్షేపణ’అని అభిప్రాయపడ్డారు. బోరా కనీసం 12 రకాల చట్టోల్లంఘనలకు పాల్పడ్డారని ఏఎస్‌జీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటికీ పక్కగా రుజువులున్నట్టు చెప్పారు. అక్టోబర్ 16న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన లెహరాదో తిరంగా’నిరసన యాత్రలో పాల్గొనేందుకు వెళ్తుండగా బోరాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ మర్నాడు వదిలేశారు.


