న్యాయమూర్తులు.. మంచి కథకులు!  | Delhi Hc judge Anish Dayal told the Himalayan Echoes Festival that judges are writers | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తులు.. మంచి కథకులు! 

Nov 1 2026 6:16 AM | Updated on Nov 1 2026 6:16 AM

Delhi Hc judge Anish Dayal told the Himalayan Echoes Festival that judges are writers

రోజూ వంద కథలు వింటూంటాం 

ప్రతిదాంట్లో పాత్రలు, కథాంశం, ఘర్షణ, పరిష్కారాలుంటాయి 

సాహిత్య ఉత్సవాల్లో జస్టిస్‌ అనీశ్‌ దయాళ్‌

నైనిటాల్‌: నిత్యం న్యాయస్థానాల్లో కేసులు విచారించే న్యాయమూర్తి సాహిత్య ఉత్సవాలకు హాజరైతే ఏమవుతుంది? జడ్జిలు ఎంత మంచి సాహితీవేత్తలో, కథకులో వివరించేందుకు సువర్ణ అవకాశం లభిస్తుంది. హిమాలయ పర్వత సానువుల్లోని నైనిటాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న ‘‘11వ హిమాలయన్‌ ఎకోస్‌ ఫెస్టివల్‌’’ లో అచ్చంగా ఇదే జరిగింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనిశ్‌ దయాళ్‌ ఈ వేడుకలో కీలకోపన్యాసం చేస్తూ... ‘‘రోజూ అరవై – వంద కథలు వింటూంటాం. ప్రతిదాంట్లో ప్రత్యేక క్యారెక్టర్లు, ఘర్షణ, ముగింపులు ఉంటాయి’’ అని వ్యాఖ్యానించారు. 

పుస్తకాల వాసన, కేసుల ఒత్తిడి తాలూకూ వేడిని తప్పించుకుందుకు కొండగాలిని ఎంచుకున్న ఈ న్యాయమూర్తి తన ప్రసంగం ద్వారా సాహిత్యం, న్యాయస్థానాల మధ్య పోలికలను ఎత్తి చూపారు. ‘‘జడ్జిలు మంచి కథకులు. మా కేస్‌ ఫైళ్లలో వాస్తవికమైన కథలు, పాత్రలు ఉంటాయి. కథాంశం కొన్నిసార్లు వాస్తవమైతే.. కొన్నిసార్లు కల్పన. మాకు సమస్యలుంటాయి. తీర్పుల రూపంలో వాటికి పరిష్కారాలూ ఉంటాయి’’ అని వివరించారు. 

అయితే ‘అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువగానే మాట్లాడతానని, విషయాలను అవసరానికి మించి విపులంగా వివరించే అలవాటు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఏ మంచి కథకైనా మూలం పాత్ర, సమస్య, పరిష్కారం కాబటి రోజూ మేము 60 నుంచి వందసార్లు ఈ పనిచేస్తూంటామని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి తాను సాహిత్య ఉత్సవాల్లో పాల్గొనే అర్హత కలిగిన వాడినేనని చమత్కరించుకున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. జస్టిస్‌ అనిశ్‌ దయాళ్‌ స్వయానా రచయిత కూడా. పిల్లల కోసం ఆయన ‘క్యాన్‌ ఐ గెట్‌ వెర్స్‌’ పేరుతో ఒక పుస్తకం రాశారు ఆయన.  

నావి మూడు ప్రపంచాలు... 
తాను న్యాయస్థానం, సాహిత్యం, కొండలనే మూడు ప్రపంచాల్ల బతుకుతూంటానని, ఈ మూడు ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా కనిపించినా ఒకొక్కటి తనకు ఏదో ఒకటి నేర్పిందని జస్టిస్‌ అనీశ్‌ దయాళ్‌ తెలిపారు. భీమ్‌తాల్‌లో సొంతిల్లు కలిగిన ఈయన ఈ మూడు ప్రపంచాల గురించి చెబుతూ... ‘‘ఒకటేమో నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. రెండోది ఊహలతో నడుస్తుంది. మూడోది అడ్డంకుల్లేని ప్రకృతి శక్తుల మధ్య ఉంటుంది’’ అని వివరించారు. న్యాయస్థానం ఒక అద్భుతమైన నాటకకేంద్రమని, మీడియాలో వచ్చే సెన్సేషనల్‌ కేసులు కాకుండా.. న్యాయప్రక్రియలను స్వయంగా అనుభూతి చెందేందుకు ప్రయత్నించాలని ప్రజలను కోరారు. 

‘‘ఎక్కువగా ఇది రామ్, శ్యామ్‌లకు చెందినవే అయి ఉంటాయి. వీళ్లిద్దరూ సామాన్యులు. చిట్టచివరి వరుసలో ఉండేవారు’’ అని అన్నారు. న్యాయస్థానాల్లో కేసుల్లో దాదాపు 80 శాతం ఇలాంటి సామాన్యులకు సంబంధించినవేనని చెప్పారు. గందరగోళంగా, అర్థం కాని తీరులో ఉండే కోర్టు పరిభాష వెనుక మనిషి అస్తిత్వం, భావోద్వేగం, సంఘర్షణ, సంక్షోభం, బలహీనత, వేధింపులు, వివక్ష, పుట్టింటితో కయ్యాలు, కుటుంబ సమస్యలు దాగి ఉంటాయని చెప్పారు. ‘‘ప్రతి రోజూ మేము కథలు చదువుతూ ఉంటాం.’’ అంటూ క్రిమినల్‌ కేసుల విచారణలో ఉండే భావోద్వేగ సవాళ్లను ప్రస్తావించారు. బాధితుల వాంగ్మూలాలు పదే పదే చదవడం సవాలుతో కూడుకున్నదని చెప్పారు.  

భాషా చమత్కారాలు... 
న్యాయ ప్రక్రియల్లో కొన్నిసార్లు విచిత్రమైన భాషాపరమైన విషయాలూ బయటపడుతూంటాయని చెబుతూ... హిందీలో ఉండే ‘మూ బోలీ బెహెన్‌’  (‘‘వరుసకు చెల్లెలు లాంటి’’) వ్యక్తీకరణ కాస్తా ఇంగ్లీషులో ‘‘మౌత్‌ స్పోకెన్‌ సిస్టర్‌’ తర్జుమా అయిన విషయాన్ని చెప్పి నవ్వులు పూయించారు. అలాగే సోమర్‌సాల్ట్‌ అనే ఇంగ్లీషు పదానికి వేసవిలో తినే ఉప్పు (సాల్ట్‌ ఈటెన్‌ ఇన్‌ సమ్మర్‌) అన్న అనువాదం చేశారని చెప్పారు. ఇంకో సందర్భంలో కక్షిదారు స్త్రీ అని చెప్పేందుకు ‘‘క్లయింటెస్‌’’ అన్న పదాన్ని వాడారని తెలిపారు. ‘‘భాషను ఎన్ని రకాలుగా హింసించవచ్చో.. అన్ని రకాలుగానూ మేము చూస్తూంటాం’’ అన్న జస్టిస్‌ అనీశ దయాళ్‌.. రచయితలు భాషాపరమైన ఆసక్తితోనైనా న్యాయస్థానాల ఫైళ్లు చదవాలని సూచించారు. న్యాయమూర్తుల్లోనూ సాహిత్య దిగ్గజాలు ఉన్నారన్న ఆయన మానవీయత, పౌరహక్కులకు మద్దతుగా నిలిచిన జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ తీర్పుల్లోని విభిన్నమైన భాషా పాటవాన్ని ప్రస్తావించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement