కొడుకు కారు ప్రమాదం.. జడ్జి అరెస్టుకు హైకోర్టు బ్రేక్! | Why is his arrest required judge Kerala HC | Sakshi
Sakshi News home page

కొడుకు కారు ప్రమాదం.. జడ్జి అరెస్టుకు హైకోర్టు బ్రేక్!

Oct 29 2026 12:25 PM | Updated on Oct 29 2026 1:06 PM

Why is his arrest required judge Kerala HC

కొచ్చి: మైనర్ కుమారుడు నడిపిన మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొని స్కూటరిస్ట్ మృతి చెందిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు జిల్లా జడ్జికి కేరళ హైకోర్టులో ఊరట లభించింది. జడ్జిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని కోరింది. కొచ్చిలో ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో స్కూటరిస్ట్ మరణించిన ఘటనకు సంబంధించి తిరుచ్చూర్ జిల్లా ఇరింజలకుడలోని మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్న అదనపు జిల్లా జడ్జి పాత్రపై ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌసర్‌ ఎడప్పగత్‌ అరెస్టుపై స్టే విధించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంబంధిత పోలీసు అధికారి ఎదుట హాజరుకావాలని జడ్జిని హైకోర్టు ఆదేశించింది. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల పిలుపు మేరకు కూడా హాజరుకావాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ జరపాలని పేర్కొంది. జడ్జి తరఫున సీనియర్ న్యాయవాది పి. విజయభాను వాదనలు వినిపించారు. ఇప్పటికే కారు ప్రమాదం కేసులో జడ్జిని పోలీసులు నాలుగు గంటలపాటు విచారించారని ఆయన కోర్టుకు తెలిపారు.

ఎందుకు అరెస్టు చేయాలి?
జడ్జిని నాలుగు గంటలపాటు విచారించిన తర్వాత మళ్లీ విచారణకు పిలవడం, అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన న్యాయాధికారి అని, దర్యాప్తునకు సహకరిస్తారని వ్యాఖ్యానించింది. అయితే, ప్రమాదంలో బాధితుల తరఫు న్యాయవాదులు బెయిల్‌ మంజూరును వ్యతిరేకించారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు జడ్జి ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తునకు సహకరించాలన్న షరతుతో అరెస్టుపై కోర్టు మధ్యంతర స్టే విధించింది.

ఇదీ చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ మార్చ్‌కు రండి: రాహుల్ గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement