ఉగాండా దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్‌ను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. గత 15 ఏళ్ల వ్యవధిలో 38 మందిని హత్య చేసి, వారి మాంసాన్ని తిన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నరమాంస భక్షకుడు ముజురిజి మోజెస్ (Mujurizi Moses) అనే వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ విషయాన్ని ఉగాండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, జనరల్ ముహూజీ కైనెరుగాబా (General Muhoozi Kainerugaba) ఎక్స్ వేదికగా వెల్లడించారు.
స్థానిక దర్యాప్తు సంస్థల ప్రకారం.. మోజెస్ 2010 నుండి 2025 మధ్య మసాకా, ఇబాండా, కజో జిల్లాల్లో ఈ దారుణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఇళ్లలోకి జొరబడి, గొడ్డలి లేదా కత్తులతో కుటుంబాలపై విరుచుకుపడేవాడు. కొన్ని సందర్భాల్లో ప్రేమిస్తానని నమ్మించి లొంగదీసుకుని చంపేవాడు. అతని సహచరులు పెంతెకోస్టల్ పాస్టర్ స్టీవెన్ ముగాంబే ఇంటిలోకి చొరబడి, అక్కడున్న వారందరినీ నరికి చంపిన ఘటన అత్యంత దారుణమైన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు గతంలో కూడా కొన్నిసార్లు పట్టుబడినప్పటికీ, వివాదాస్పద పరిస్థితులలో తప్పించు కున్నాడు. మరికొన్న సార్లు విడుదలయ్యాడు.
అతని అరెస్టు అనంతరం, అనుమానితుడి నివాసం నుంచి అధికారులు భౌతిక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆరోపించిన నేరాలతో వీటికి సంబంధం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి, దర్యాప్తు అధికారులు ఆ ప్రాంతంలోని అపరిష్కృత అదృశ్యమైన వ్యక్తుల కేసులు, హత్యల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లైన నాలుగు నెలలకే హోటల్ గదిలో అనంతలోకాలకు : భర్త పనేనా?
ఆర్మీ చీఫ్ ప్రకటన
మోజెస్‌ను ఉగాండా చరిత్రలోనే అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్ మరియు నరరూప రాక్షసుడిగా (Cannibal) జనరల్ వర్ణించారు. అతడికి బహిరంగంగా విచారణ జరిపి, కచ్చితంగా మరణశిక్ష అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారులు మోజెస్ నివాసం నుండి ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతంలో నమోదైన ఇతర మిస్సింగ్ కేసులు, పెండింగ్ హత్యల కేసులతో అతడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.


