వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్, మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ అత్యాచార ఆరోపణలు చేశారు. 1993లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో జరిగిన ఓ ఘటనలో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించినట్లు అమెరికా ప్రతినిధుల సభలోని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు విడుదల చేసిన నివేదిక పేర్కొంది. గతంలో ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన క్యూల్.. తాజాగా అత్యాచారం కూడా జరిగిందని వెల్లడించినట్లు నివేదికలో వివరించారు. ఈ ఆరోపణలను వైట్‌హౌస్ ఖండించింది. డెమోక్రాట్లు రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది.
1993లో ఏం జరిగింది?
1993 నవంబరులో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో జరిగిన ఓ అందాల పోటీ కార్యక్రమం సందర్భంగా ట్రంప్‌ను కలిసినట్లు క్యూల్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అప్పటికి ఆమె వయసు 24 సంవత్సరాలు. తనకు వీసా ఇప్పించడంతోపాటు న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రవేశం పొందేలా చూస్తానని ట్రంప్ హామీ ఇచ్చినట్లు ఆమె ఆరోపించారు. అనంతరం హోటల్‌లోనిపై అంతస్తులో తనను కలిసేందుకు రావాలని ట్రంప్ ప్రతినిధి ద్వారా ఆహ్వానం అందినట్లు తెలిపారు. అక్కడ ట్రంప్ తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించినట్లు నివేదిక వెల్లడించింది.
ఎప్‌స్టీన్‌తో పరిచయం.. పార్టీలకు ఆహ్వానం
ట్రంప్ నుంచి దూరమైన తర్వాత జెఫ్రీ ఎప్‌స్టీన్ తనను సంప్రదించినట్లు క్యూల్ తెలిపారని నివేదిక పేర్కొంది. తాను ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడినని ఎప్స్టీన్ చెప్పినట్లు, మార్-ఎ-లాగోలో జరిగే పార్టీకి ఆహ్వానించినట్లు ఆమె ఆరోపించారు. లైంగిక నేరాలకు పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఎప్‌స్టీన్‌తో తన స్నేహాన్ని చాలా కాలం క్రితమే తెంచుకున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటించారు. ఎప్స్టీన్‌ను మార్-ఎ-లాగో క్లబ్ నుంచి బయటకు పంపించానని కూడా ఆయన పలుమార్లు పేర్కొన్నారు.
గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు
2024 అక్టోబరులోనే ట్రంప్‌పై క్యూల్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ప్లాజా హోటల్‌లో ట్రంప్ తనను ముద్దు పెట్టుకుని, దుస్తులు పైకి లేపేందుకు ప్రయత్నించారని, శరీరంపై అసభ్యంగా తాకారని అప్పట్లో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో అత్యాచారం జరిగిందని ఆమె చెప్పలేదు. ఈ ఘటన గురించి సుమారు 20 ఏళ్ల క్రితమే తనకు చెప్పారని క్యూల్ స్నేహితుడు వెల్లడించినట్లు అప్పటి కథనంలో పేర్కొన్నారు. తాజాగా విడుదలైన నివేదికలో ఆమె ఆరోపణలను మరింత వివరంగా ప్రస్తావించారు.
వైట్‌హౌస్ ఖండన
ట్రంప్‌పై వచ్చిన తాజా ఆరోపణలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. రిపబ్లికన్లకు పెరుగుతున్న ప్రజాదరణ నుంచి అమెరికన్ల దృష్టిని మళ్లించేందుకు డెమోక్రాట్లు నిరాశతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అధ్యక్షుడి ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు నివేదిక పేర్కొంది. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అంశాల్లో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు క్లీన్‌చిట్ లభించిందని అధ్యక్షుడి ప్రతినిధి గతంలోనూ పేర్కొన్నారు.
మరో నలుగురు మహిళల ఆరోపణలు
ట్రంప్‌పై అత్యాచారం లేదా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరో నలుగురు మహిళల వాంగ్మూలాలను కూడా తాజా నివేదికలో ప్రస్తావించారు. ప్లాజా హోటల్‌లో నిర్వహించిన అందాల పోటీలను యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగించుకున్నారని నివేదిక ఆరోపించింది. ఎప్‌స్టీన్ లేదా ఘిస్లేన్ మాక్స్‌వెల్ ద్వారా కొందరు మహిళలను ట్రంప్ వద్దకు పంపేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు జేమీ రాస్కిన్ తెలిపారు.
ఇదీ చదవండి: ట్రంప్‌కు మరో తలనొప్పి.. డెమోక్రాట్‌కు రిపబ్లికన్ల మద్దతు!


