ఇజ్రాయెల్ ఎన్నికల్లో ‘అరబ్ ఫ్యాక్టర్’.. వీళ్ల చేతుల్లోనే నెతన్యాహు భవిష్యత్తు! | Israel Elections, Arab Voters Emerge As Potential Kingmakers As Netanyahu And Opposition Leaders Vie For Power Amid Regional Tensions | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ ఎన్నికల్లో ‘అరబ్ ఫ్యాక్టర్’.. వీళ్ల చేతుల్లోనే నెతన్యాహు భవిష్యత్తు!

Oct 27 2026 10:11 AM | Updated on Oct 27 2026 11:00 AM

How Israel Arab Voters Hold the Balance of Power

జెరూసలేం: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ, అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (కెస్సెట్) ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దేశ భవిష్యత్తును, నూతన ప్రభుత్వాన్ని నిర్ణయించనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 120 స్థానాల కోసం దాదాపు 37 నుంచి 38 పార్టీలు బరిలో నిలిచాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (61 సీట్లు) ఏ ఒక్క కూటమికి కూడా సులభంగా రాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో ‘అరబ్ ఫ్యాక్టర్’ మరోసారి చర్చాంశనీయంగా మారింది.

ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని రైట్‌వింగ్ కూటమికి, ప్రతిపక్షం తరఫున ప్రధాని రేసులో గట్టి పోటీ ఇస్తున్న మాజీ సైనిక చీఫ్ గాడి ఐసెన్‌కోట్ (యాషర్‌ పార్టీ) మధ్య ఈ ఎన్నికల్లో ప్రధానంగా హోరాహోరీ పోరు సాగుతోంది.

కింగ్ మేకర్లుగా మారుతున్న అరబ్ ఓటర్లు 
ఇజ్రాయెల్ జనాభాలో సుమారు 20శాతం వరకు ఉన్న అరబ్ మైనారిటీ ఓటర్లు, దశాబ్దాలుగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఇప్పుడు కీలక శక్తిగా అవతరించారు. పార్లమెంట్‌లో అడుగు పెట్టడానికి 3.25శాతం ఎలక్టోరల్ త్రెషోల్డ్ నిబంధన ఉన్నప్పటికీ, అరబ్ పార్టీల మద్దతు లేకుండా ఏ కూటమి కూడా సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు సంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉన్న అరబ్ ఓటర్లు, నేడు తమ సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధి, హక్కుల సాధన కోసం ఎన్నికల్లో అత్యంత చురుగ్గా పాల్గొంటున్నారు.

ఎన్నికల ప్రాధాన్యత
లికుడ్‌ పార్టీ నేతగా నెతన్యాహూ 1996 నుంచి ఇప్పటివరకూ పలుమార్లు ఇజ్రాయెల్‌ ప్రధానిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్ జరిపిన దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఆ తరువాత ఇజ్రాయెల్‌ గాజాపై తీవ్ర ప్రతిదాడులతో విరుచుకుపడింది. వైమానిక, భూతల సైనిక చర్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో జాతీయ భద్రత, జవాబుదారీతనం అత్యంత ప్రధాన చర్చనీయాంశాలు అయ్యాయి. మరోవైపు నెతన్యాహూ ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండగా, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సైతం ఆయనపై యుద్ధ నేరాల విషయంలో అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఈ ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

ప్రాంతీయ భద్రత, యుద్ధానంతరం అనుసరించాల్సిన విధానాలు, అమెరికా సహా అంతర్జాతీయ దేశాలతో దౌత్య సంబంధాల వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఈ ఎన్నికల ఫలితాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇజ్రాయెల్ రాజకీయ గమనాన్ని, ప్రభుత్వాల స్థిరత్వాన్ని నిర్దేశించడంలో ఈ ‘అరబ్ ఫ్యాక్టర్’ కేవలం ఒక ఓటు బ్యాంకు మాత్రమే కాదని, దేశ రాజకీయ భవితను శాసించే అసలైన శక్తిగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement