ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో బ్రెజిల్ ఎన్నికల ఫలితం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించే బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మరోసారి విజయం సాధించడం లాటిన్ అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ ఫలితాన్ని కేవలం ఒక దేశ ఎన్నికల విజయంగా కాకుండా.. వామపక్ష రాజకీయాలు, జాతీయ సార్వభౌమాధికారం, అమెరికా ప్రభావం వంటి అంశాలతో ముడిపెట్టి విశ్లేషిస్తున్నారు.
రెండో రౌండ్‌లో సత్తా.. 44 లక్షల ఓట్ల ఆధిక్యం!
2026 అక్టోబర్ 25న జరిగిన రెండో విడత ఎన్నికల్లో లూలా తన ప్రత్యర్థి, ఫ్లావియో బోల్సోనారోపై విజయం సాధించారు. ఎన్నికల అధికారుల వివరాల ప్రకారం లూలాకు 51.8 శాతం ఓట్లు రాగా.. బోల్సోనారోకు 48.2 శాతం ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య సుమారు 44 లక్షల ఓట్ల తేడా నమోదైంది. తొలి విడతలో ప్రత్యర్థి కంటే వెనుకబడిన లూలా.. రెండో విడతలో వ్యూహాన్ని మార్చుకుని ఓటర్ల మద్దతు కూడగట్టారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, నేరాలు, ప్రజల భద్రత వంటి అంశాలు ఎన్నికల్లో కీలకంగా మారాయి. బోల్సోనారో నేరాలపై కఠిన చర్యలు, ఆహార ధరల తగ్గింపు వంటి హామీలు ఇవ్వగా.. లూలా సామాజిక సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలపై దృష్టి సారించారు.
ట్రంప్ ప్రభావానికి సవాల్..
అమెరికాతో బ్రెజిల్ సంబంధాలు లూలా విజయానికి సంబంధించిన ప్రధాన అంశాల్లో ఒకటి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, లాటిన్ అమెరికాలో అమెరికా పెత్తనాన్ని లూలా గతంలో విమర్శించారు. మరోవైపు బోల్సోనారోను ట్రంప్‌కు సన్నిహితుడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో లూలా విజయం అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనుకునే రాజకీయ వర్గాలకు ఊరటనిచ్చింది. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రెజిల్‌లో అధికారంలో ఉన్న నాయకుడి నిర్ణయాలు వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ సహకారం, విదేశాంగ విధానంపై ప్రభావం చూపగలవు. అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య లూలా తిరిగి అధికారంలోకి రావడం బ్రెజిల్ తన ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే వైఖరిని కొనసాగించవచ్చనే సంకేతాలను ఇస్తోంది. అయితే ఈ ఎన్నికల ఫలితంతో అమెరికా-బ్రెజిల్ సంబంధాలు పూర్తిగా మారిపోతాయని ఇప్పుడే చెప్పలేం.
లాటిన్ అమెరికాలో లెఫ్ట్ వింగ్ వర్సెస్ రైట్ వింగ్
లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో రైట్ వింగ్ రాజకీయాలు, ట్రంప్‌తో సైద్ధాంతిక సాన్నిహిత్యం ఉన్న నేతల ప్రభావం గురించి చర్చ జరుగుతున్న సమయంలో లూలా విజయం సాధించారు. దీంతో వామపక్ష నాయకులు కూడా ప్రజల మద్దతు పొందగలరనే విషయం మరోసారి స్పష్టమైంది. మెక్సికో, బ్రెజిల్ వంటి ప్రధాన దేశాల్లో వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న నాయకత్వం కొనసాగడం ఈ పరిణామానికి ప్రాధాన్యాన్ని పెంచింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ లూలాకు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యం, బ్రెజిల్ ప్రజల విజయాన్ని ప్రస్తావించారు. క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్-కానెల్ కూడా లూలాకు శుభాకాంక్షలు చెబుతూ శాంతి, సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను ప్రస్తావించారు. మరోవైపు చిలీ అధ్యక్షుడు జోస్ ఆంటోనియో కాస్ట్, ఈక్వెడార్ అధ్యక్షుడు డానియెల్ నోబోవా కూడా లూలాకు అభినందనలు తెలిపారు. ఆర్థిక సమగ్రత, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై వారు దృష్టి సారించారు. దీంతో రాజకీయ విభేదాలున్నప్పటికీ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమనే విషయం వెల్లడైంది.
ట్రేడ్ యూనియన్ నేత నుంచి నాలుగోసారి అధ్యక్షునిగా..
లూలా రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపులతో సాగింది. 1970వ దశకంలో ట్రేడ్ యూనియన్ నాయకునిగా గుర్తింపు పొందిన ఆయన.. అనంతరం వర్కర్స్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 2002లో తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2006లో మరోసారి విజయం సాధించారు. ఆయన తొలి పాలనలో కార్మికుల సంక్షేమం, సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం లభించింది. అయితే తర్వాతి కాలంలో అవినీతి ఆరోపణలు, రాజకీయ సంక్షోభాలు బ్రెజిల్‌ను ప్రభావితం చేశాయి. ఒక అవినీతి కేసులో లూలా దోషిగా తేలడంతో 580 రోజులు జైలులో గడిపారు. అనంతరం బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆయన శిక్షను రద్దు చేయడంతో రాజకీయాల్లోకి తిరిగి వచ్చే మార్గం సుగమమైంది. 2022లో అప్పటి అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై స్వల్ప ఆధిక్యంతో గెలిచి, 2023లో తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2026 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడం ఆయన రాజకీయ జీవితంలో కీలక ఘట్టంగా నిలిచింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వివాదాలు కూడా కొనసాగాయి. పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పొడిగించడంపై బోల్సోనారో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు
లూలా ముందున్న సవాళ్లేంటి?
లూలా విజయం లాటిన్ అమెరికాలో ఒకే రాజకీయ సిద్ధాంతం శాశ్వతంగా ఆధిపత్యం చెలాయించదనే సందేశాన్ని ఇచ్చింది. సామాజిక న్యాయం, కార్మికుల హక్కులు, జాతీయ సార్వభౌమాధికారానికి ప్రాధాన్యం ఇచ్చే నాయకుడికి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. అయితే ఈ ఫలితాన్ని ట్రంప్ ఓటమిగా లేదా వామపక్షాల సంపూర్ణ విజయంగా మాత్రమే చూడటం సరైనది కాదు. బ్రెజిల్‌లో ద్రవ్యోల్బణం, ప్రజల భద్రత, అవినీతి ఆరోపణలు, రాజకీయ విభజన వంటి సమస్యలు లూలాకు సవాలుగా మారనున్నాయి. పార్లమెంటులో, ప్రాంతీయ రాజకీయాల్లో రైట్‌వింగ్ శక్తుల ఉనికి కూడా ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా లూలా విజయం బ్రెజిల్ తన రాజకీయ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకోవాలనే ఆకాంక్షకు ప్రతీకగా నిలిచింది. అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే తన ప్రయోజనాలకు అనుగుణంగా స్వతంత్ర విదేశాంగ, ఆర్థిక విధానాలను అనుసరించగలదా అన్నదే ఇప్పుడు కీలకం.
ఇదీ చదవండి: ‘మెటా’పై లూలాకు కోపమెందుకు?.. ఇప్పుడేం చేయనున్నారు?


