ట్రంప్‌ డబుల్‌ గేమ్‌.. ఇరాన్‌పై డేంజర్‌ సిగ్నల్‌! | Trump says US could attack Iran maybe tomorrow deal to reopen Hormuz | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ డబుల్‌ గేమ్‌.. ఇరాన్‌పై డేంజర్‌ సిగ్నల్‌!

Oct 25 2026 7:53 AM | Updated on Oct 25 2026 7:58 AM

Trump says US could attack Iran maybe tomorrow deal to reopen Hormuz

ఒక్క రాత్రి గడిస్తే చాలు.. పశ్చిమాసియా మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లుతుందా? చర్చల ముసుగులో యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయలాంటి హార్మూజ్‌ జలసంధి మరోసారి రణరంగంగా మారబోతోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ‘రేపే దాడులు చేసే అవకాశం ఉంది.. లేదంటే భారీ ఒప్పందం కుదరవచ్చు’ అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు యుద్ధ భయాలను మరింత పెంచాయి. అలాగే, ఇరాన్‌ ఒప్పందానికి సిద్ధంగా ఉందని ఒకవైపు చెబుతూనే.. ఆ దేశాన్ని నమ్మగలమా అంటూనే మరోవైపు సందేహాలు వ్యక్తం చేశారు.

ఫ్లోరిడాలో శనివారం ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై మరోసారి దాడులు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేదు. రేపు దాడులు జరగవచ్చా అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయాన్ని ముందుగానే చెబుతానని అనుకుంటున్నారా అంటూ ఎదురు ప్రశ్నించారు. రేపే దాడులు చేసే అవకాశం ఉందని, అదే సమయంలో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని చెప్పిన ట్రంప్‌.. అసలు సమస్య ఆ ఒప్పందానికి ఆ దేశం కట్టుబడి ఉంటుందా లేదా అన్నదేనని పేర్కొన్నారు. దీంతో అమెరికా తదుపరి అడుగు సైనిక చర్య వైపు పడుతుందా, లేక దౌత్యానికి మరో అవకాశం ఇస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

ఇరాన్‌ సైన్యాన్ని దెబ్బతీశాం.. 
ఇదే సమయంలో ఇరాన్‌పై తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని ట్రంప్‌ సమర్థించుకున్నారు. అమెరికా నౌకాదళం, సైన్యం అద్భుతంగా పనిచేశాయని చెబుతూ.. ఇరాన్‌ యుద్ధ విమానాలన్నింటినీ ధ్వంసం చేశామని, 259 నౌకలు సముద్ర గర్భంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ ప్రస్తుతం రికార్డు స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలు ఇరాన్‌పై అమెరికా ఒత్తిడిని కొనసాగించాలన్న వైఖరిని సూచిస్తున్నాయి. దీంతో, దాడుల అంశాన్ని ప్రస్తావించడం, ఒప్పందంపై సందేహాలు వ్యక్తం చేయడం.. వాషింగ్టన్‌ వైఖరిపై ఉత్కంఠను పెంచుతున్నాయి.

హార్మూజ్‌ కథేంటి.. 
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి ఇప్పుడు అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రధాన వివాదాంశంగా మారింది. అమెరికా తన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేస్తే.. ఈ జలమార్గాన్ని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌ ప్రతిపాదించిందని సౌదీ అరేబియాకు చెందిన ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. పాకిస్థాన్‌ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదన అమెరికాకు చేరినట్లు పేర్కొంది. అయితే, ఈ వార్తలను ఇరాన్‌ తోసిపుచ్చింది. పాకిస్థాన్‌ ద్వారా అమెరికాకు ఎలాంటి ప్రతిపాదన పంపలేదని తస్నీమ్‌ వార్తా సంస్థ వెల్లడించింది. సౌదీ మీడియా కథనం అబద్ధం, కల్పితమని ప్రెస్‌ టీవీ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్‌ చెబుతున్న ఒప్పందం ఏ ప్రాతిపదికన సాధ్యమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు ఒప్పందానికి అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు చెబుతుండగా.. మరోవైపు అలాంటి ప్రతిపాదనే చేయలేదని ఇరాన్‌ స్పష్టం చేస్తోంది. ఈ విభేదాల మధ్య జలసంధి భవిష్యత్తుపై అనిశ్చితి కొనసాగుతోంది.

అమెరికా దౌత్యవేత్తలపై దాడులకు కుట్ర?
ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలను ఇరాన్‌ గణనీయంగా పెంచిందని నిఘా సంస్థలు గుర్తించినట్లు ఆక్సియోస్‌ కథనం వెల్లడించింది. దీంతో అమెరికా భద్రతా అధికారుల్లో ఆందోళన పెరిగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని పలు అమెరికా రాయబార కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే, ఈ కుట్రలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థలపై నిర్ధారిత సమాచారం బహిరంగంగా వెల్లడికాలేదు.

చర్చల తెర వెనుక యుద్ధ సన్నాహాలా?
ట్రంప్‌ వ్యాఖ్యల్లో రెండు కీలక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని కొనసాగించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్న సంకేతాలిస్తూనే.. మరోవైపు భారీ ఒప్పందానికి అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ ప్రతిపాదన చేసిందన్న వార్తలను టెహ్రాన్‌ ఖండించడం, అమెరికా దౌత్యవేత్తలపై ముప్పు పెరుగుతోందన్న నిఘా నివేదికలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇప్పుడు ప్రపంచం చూపంతా అమెరికా తదుపరి అడుగుపైనే. ట్రంప్‌ హెచ్చరికలు మాటలకే పరిమితమవుతాయా.. లేక ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యకు దిగుతారా? చర్చల ద్వారా జలసంధి వివాదానికి పరిష్కారం లభిస్తుందా? ఒకవేళ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాలిస్తే, దాని ప్రభావం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ చమురు సరఫరా, ధరలపైనా పడే అవకాశముంది. ప్రస్తుతానికి దాడులపై స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. కానీ అమెరికా, ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇరాన్‌ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి కొత్త ముప్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement