బ్రెజిల్‌ మళ్లీ లులాదే! | Lula wins historic fourth term as Brazilian president | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ మళ్లీ లులాదే!

Oct 27 2026 5:17 AM | Updated on Oct 27 2026 5:17 AM

Lula wins historic fourth term as Brazilian president

సావోపౌలోలో జరిగిన విజయోత్సవ ర్యాలీ(ఇన్‌సెట్‌లో) లులా అభివాదం

బ్రెజిల్‌ సార్వభౌమత్వంపై రాజీలేదు: లులా 

ఫలితాలను తిరస్కరిస్తున్నా: బోల్సనారో 

రాజధానిలో జోరుగా ఉత్సవాలు

రియో డి జెనీరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై నిత్యం విమర్శల వర్షం కురిపించే లూయిజ్‌ ఐనాసియో లులా డ సిల్లా మరోసారి బ్రెజిల్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం నాడు వెలువడ్డాయి. ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు ఫ్లావియో బోల్సనారో పరాజయం పాలయ్యారు. లూలాకు మొత్తం 6.42 కోట్ల ఓట్లు (51.8 శాతం) లభించగా బోల్సనారోకు 5.98 కోట్ల (48.21 శాతం) ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో 44.3 లక్షల ఓట్ల మెజారీ్టతో లులా విజయం సాధించినట్లు బెజిల్‌ ఎలక్టోరల్‌ కోర్టు ప్రకటించింది. 

ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో లులా  నాలుగోసారి అధ్యక్ష స్థానాన్ని అధిరోహించడం ఇక లాంఛనమే.  అయితే ఈ ఎన్నికల ఫలితాలను ఫ్లావియో తిరస్కరిస్తున్నారు. కొన్నిచోట్ల పోలింగ్‌ సమయాన్ని చివరి నిమిషంలో రెండు గంటలపాటు పొడిగించారని, ఫలితంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఫ్లావియో ఆరోపణ. ఫలితాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఎన్నికలు లాటిన్‌ అమెరికా ప్రాంతంలో పెరిగిపోతున్న అమెరికన్‌ ప్రభావాన్ని తిప్పికొట్టేలా ఉందని, కొంచెం అటు ఇటుగా భారత స్థాయి ఆర్థిక వ్యవస్థ అమెరికా టారిఫ్‌ ఒత్తిళ్లకు తలొగ్గకుండానే పనిచేయగలదన్న ఆశాభావాన్ని కల్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

పొరుగున ఉన్న వెనిజువెలాలో అమెరికా రాత్రికి రాత్రి అధ్యక్షుడిని సైతం అక్రమంగా నిర్బంధించడం.. ఆ తరువాత తన మాటలు వినే వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇటీవలి పరిణామాలే. అంతేకాకుండా.. వెనిజువెలాలోని చమురుపై పెత్తనం మాదేనని అధ్యక్షుడు ట్రంప్‌ ఈమధ్యే వ్యాఖ్యానించారు కూడా. ఇలాంటి పరిస్థితినే బ్రెజిల్‌లోనూ తీసుకొచ్చేందుకు అమెరికా చేసిన ప్రయత్నం లులా గెలుపుతో బెడిసికొట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.  

బ్రెజిల్‌ ఎవరి సొత్తు కాదు: లులా 
ప్రథమ మహిళ లేడీ రొసాంజెలా డ సిల్వాతో కలిసి విజయోత్సవాలను జరుపుకున్న లులా బ్రెజిల్‌ దేశం ఎవరి సొత్తో కాదని అమెరికాపై పరోక్ష వ్యాఖ్య చేశారు. విజయం రూఢి అయిన తరువాత రాజధాని రియో డి జెనిరోలో కూటమి భాగస్వాములు, మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మతం, లింగం వంటి అంశాల ఆధారంగా వివక్ష చూపబోనని, ప్రజలందరినీ గౌరవిస్తానని స్పష్టం చేసిన ఆయన ప్రత్యర్థి బోల్సనారో వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. లులా గెలుపు సంబంరాలు రియో డి జెనిరోలో ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు లులాకు మద్దతుగా ఎరుపు రంగు దుస్తుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. బోల్సనారో మద్దతుదారులను ఉద్దేశించి పలువురు.. ‘‘ఓడిపోయారు... ఇంకా బిగ్గరగా ఏడవండి’’అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement