సెర్బియాలో విద్యార్థి విజయం! | Students achieve stunning political victory in Serbia | Sakshi
Sakshi News home page

సెర్బియాలో విద్యార్థి విజయం!

Oct 27 2026 5:25 AM | Updated on Oct 27 2026 5:25 AM

Students achieve stunning political victory in Serbia

సోమవారం సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో యువత ఆనందహేల

ఎన్నికల్లో స్టూడెంట్‌ లిస్ట్‌ విజయం 

అలెక్సాండర్‌ వూచిచ్‌ అధికారానికి చరమగీతం

దేశవ్యాప్తంగా సంబరాలు

బెల్‌గ్రేడ్‌: యూరోపియన్‌ దేశం సెర్బియాలో చరిత్ర పునరావృతమైంది. ఇరవై ఆరేళ్ల క్రితం మాదిరిగానే మరోసారి విద్యార్థులు... రాజకీయాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. అధికార మార్పిడిని శాసించారు. జెన్‌–జీ అనండి.. యువత అనండి... విద్యార్థులన్న పేరైనా ఇవ్వండి కానీ.. వీరి ధాటికి పదేళ్లుగా దేశ రాజకీయాలను శాసించిన అలెక్సాండర్‌ వూచిచ్‌ తలవంచక తప్పలేద

ప్రభుత్వంలో వేళ్లూనుకుపోయిన అవినీతి, బాధ్యతా రాహిత్యాలను ప్రశ్నించడం ద్వారా రెండేళ్ల క్రితం మొదలైన సెర్బియన్‌ విద్యార్థి ఉద్యమం అలెక్సాండర్‌ వూచిచ్‌ పదవీచ్యుతితో ముగిసింది. మొత్తం 250 స్థానాలున్న సెర్బియా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో స్టూడెంట్‌ లిస్ట్‌ పేరుతో పోటీ చేసిన విద్యార్థి ఉద్యమ నేతలు 53.3 శాతం ఓట్లతో 140 స్థానాలు దక్కించుకున్నారు. అలెక్సాండర్‌ వూచిచ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న యునైటెడ్‌ సెర్బియాకు 104 స్థానాలు లభించాయి. 

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి యథాలాపంగా చేసిన ఓ వ్యాఖ్య కాక్రోచ్‌ జనతా పార్టీ పేరిట యువత నేతృత్వంలో ఉద్యమం ప్రారంభమయ్యేందుకు కారణమైనట్టే సెర్బియాలో 2024లో నోవిసాడ్‌ ప్రాంత రైల్వే స్టేషన్‌లో ఓ కాంక్రీట్‌ పైకప్పు కూప్పకూలిపోవడం ప్రజాగ్రహానికి, ఆ తరువాత యువ ఉద్యమానికి కారణమైంది. పదహారు మంది ప్రాణాలు బలితీసుకున్న ఆ ఘటన సెర్బియన్లను షాక్‌కు గురించి చేసింది. ప్రభుత్వ అవినీతిని నిలదీసేలా ఉసికొల్పింది. యువత ముందుండి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ప్రజల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు పెడితే సహించేది లేదని హెచ్చరించింది. 

విద్యాసంస్థల్లో మొదలైన ఈ ఆందోళనలు కాస్తా నెమ్మదిగా ఒక పౌర ఉద్యమంగా మారింది. రైతులు, విద్యావేత్తలు, కళాకారులు, వైద్యు లు... ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు ఒక్కమాటపైకి వచ్చేశారు. ఉద్యమం అంతకంతకూ విస్తృతమై అధికారంలో ఉన్న వారికి ముచ్చెమటలు పట్టించింది.  2014 నుంచి అలెక్సాండర్‌ వూచిచ్‌ సెర్బియన్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ తరఫున ప్రధానిగా, అధ్యక్షుడిగానూ పనిచేశారు. సుమారు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో దశాబ్దానికిపైగా సెర్బియాను శాసించారని చెప్పాలి.

2008లో కొన్ని ఇతర పార్టీలతో కలిసి యునైటెడ్‌ సెర్బియా కూటమిని ఏర్పాటు చేసిన వూచిచ్‌ దేశానికి ఆర్థిక స్థిరత్వం కల్పించాడని, అభివృద్ధి చేశాడని మద్దతుదారులు, సానుభూతిపరులు అంటారు. విపక్షాలు మాత్రం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అధికారాన్ని కేంద్రీకృతం చేశారని, మీడియాను సంకెళ్లలో బంధించారని విమర్శిస్తాయి. ఇదే అంశంపై కొన్ని నెలలుగా దేశంలో అసంతృప్తి కొనసాగుతోంది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సెర్బియా ప్రజలు అలెక్సాండర్‌ వూచిచ్‌కు తిరుగులేని సమాధానం చెప్పారు. స్టూడెంట్‌ లిస్ట్‌ నేతలకు విజయం కట్టబెట్టారు. అయితే ఈ పరాజయంపై వూచిచ్‌ స్పందన వేరుగా ఉంది. విదేశీ శక్తుల జోక్యంతోనే తాను ఓడిపోయినట్లు చెబుతున్నారు ఆయన. ‘‘కొన్ని యూరోపియన్‌ దేశాల సాయంతో అమెరికా డీప్‌స్టేట్‌ తీసుకొచ్చిన విప్లవం ఇది అనేందుకు ఎన్నికల ఫలితాలే రుజువు’’అని ఆయన ఎన్నికల ఫలితాల తరువాత ఆదివారం వ్యాఖ్యానించారు కూడా.  

ఉద్యమ సారథులు వీరు... 
ఈ ఉద్యమంలో ఇల్జా స్రడనోవీది కీలకపాత్ర. కార్డియాలజిస్టు. యూనివర్సిటీ అధ్యాపకులు కూడా. ఉద్యమం తాలూకూ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విజయం సాధించిన రాడొమిర్‌ సయి కూడా బెల్‌గ్రేడ్‌ యూనివర్సిటీ అధ్యాపకులుగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో వీరు     ఇచ్చనా హామీలు కూడా చాలా సింపుల్‌. ప్రభుత్వ అధికారులు పెత్తనం చెలాయించడం కాకుండా బాధ్యత తీసుకునేలా చేస్తామన్నారు. అలాగే అవినీతి కట్టడికి సంస్కరణలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడిచే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్న వీరి మాటలతో సెర్బియన్‌ యువత బాగా కనెక్ట్‌ అయ్యింది. ఎన్నికల ఫలితాలు స్పష్టమైన నేపథ్యంలో అలెక్సాండర్‌ వూచిచ్‌ కూడా తన ఓటమిని అంగీకరించారు. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement