న్యూఢిల్లీ: ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా జరిగిన కత్తిపోట్ల ఘటనలో 9వ తరగతి విద్యార్థి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై చేసిన కామెంట్‌కు సంబంధించిన వివాదమే ఈ దాడికి కారణమని భావిస్తూ పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు దాడికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం పితంపుర గుండా దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లోని కామెంట్‌కు సంబంధించి ఆషు అనే యువకుడితో కొందరికి వివాదం ఏర్పడింది. ఊరేగింపు సమయంలో నిందితులు ఆషును చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో 9వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, ఆషు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ వివాదమే దాడికి కారణమని ప్రాథమికంగా తెలిసినప్పటికీ, పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా దీనికి ముందు మరో కత్తిపోట్ల ఘటన జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌లోని సెంట్రల్ పార్క్‌లో మంగళవారం సాయంత్రం సుభాన్ (20) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి ధూమపానం చేస్తుండగా 5 నుంచి 6 మంది బాలుర బృందం దాడి చేసింది. ధూమపానం చేయడాన్ని వారు వ్యతిరేకించడంతో మొదలైన వివాదం దాడికి దారితీసింది.
తీవ్రంగా గాయపడిన సుభాన్‌ను మొదట జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి, ఆ తర్వాత జిటిబి ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: Saudi: డ్రోన్ దాడిలో ఇద్దరు మృతి, భారతీయునికి గాయాలు


