రియాద్: సౌదీ అరామ్‌కో(ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థ)కు చెందిన షైబా (Shaybah) చమురు కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఫిలిప్పీన్స్, నేపాల్ దేశస్థులుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఒక భారతీయుడు, ఒక పాకిస్థానీ పౌరుడు ఉన్నారు. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
బుధవారం ఉదయం చమురు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్‌ను సౌదీ సైన్యం గగనతలంలోనే అడ్డుకుని కూల్చివేసింది. అయితే, డ్రోన్‌ను అడ్డుకున్న తర్వాత రాలిన శకలాలు చమురు క్షేత్రం వెలుపల పనిచేస్తున్న ఒక వాహనంపై పడటంతో మంటలు చెలరేగి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శకలాలు పడటం వల్ల భారతీయుడు, పాకిస్థానీ పౌరునికి గాయాలయ్యాయి. అయితే, ఈ దాడి వల్ల చమురు కేంద్రం రోజువారీ ఉత్పత్తి, కార్యకలాపాలకు ఎలాంటి నష్టం లేదా అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ, సంబంధిత అధికారులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
దమ్మామ్ విమానాశ్రయంపై దాడి: ఒకరు మృతి
చమురు కేంద్రాలు, విమానాశ్రయాలు వంటి సౌదీ కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు కొనసాగిస్తున్నారు. బుధవారం దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నామని సౌదీ పౌర విమానయాన జనరల్ అథారిటీ వెల్లడించింది.
సిబ్బందిని వెనక్కి పిలిపించిన అమెరికా
సౌదీలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తుండటంతో, అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీలోని తమ రాయబార కార్యాలయానికి చెందిన అత్యవసరం కాని సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ, తమ సిబ్బంది, వారి కుటుంబాల రక్షణే వాషింగ్టన్‌కు అత్యంత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు విమానాశ్రయాలు, ఇతర కీలక ప్రాంతాలపై దాడులకు పాల్పడుతూ పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రాంతీయ మిత్రదేశాల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇదీ చదవండి: పాక్‌లోనే దావూద్.. ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం


