న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఉగ్రవాద నిరోధక నివేదికలో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని ‘డీ-కంపెనీ’ని ‘భారత్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా’గా పేర్కొనడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నివేదికను రూపొందించిన ఐరాస ప్రత్యేక నిపుణుడు బెన్ సాల్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని, వాస్తవాలను వక్రీకరించేలా నివేదికలు తయారు చేయడం ఐక్యరాజ్యసమితి విశ్వసనీయతకే తీవ్ర నష్టం కలిగిస్తుందని భారత్ హెచ్చరించింది.
ఐరాసలో భారత శాశ్వత మిషన్ మొదటి కార్యదర్శి రఘు పూరి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, దావూద్ ఇబ్రహీం భారత్‌లో తీవ్రమైన నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న వాంటెడ్ నేరస్థుడని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి రికార్డుల ప్రకారమే దావూద్.. ఒసామా బిన్ లాడెన్ దొరికిన పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడని, 1993 నాటి బాంబు పేలుళ్ల నుంచి భారత్ అతనిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన గుర్తుచేశారు.
అంతర్జాతీయ సమాజంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు లేదా సంస్థలు మానవ హక్కుల చట్టాన్ని తమ దుశ్చర్యలకు కవచంగా వాడుకోవడం సాధారణంగా మారిపోయిందని రఘు పూరి దుయ్యబట్టారు. తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రచారం చేసేవారికి మానవ హక్కులు ఆశ్రయం కల్పించలేవని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో విడదీయరాని, శాశ్వతమైన అంతర్భాగాలని రఘు పూరి పునరుద్ఘాటించారు. పాకిస్థాన్ సైనిక పాలకులు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అసత్య ప్రచారాలను అంతర్జాతీయ సమాజం విశ్వసించదని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సీఈసీ అంశం: నవంబర్‌లో 'ఇండియా' కూటమి రెండో దశ నిరసనలు


