న్యూఢిల్లీ: నవంబర్ మొదటి వారంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రెండో విడత నిరసనలను ప్రారంభించాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి యోచిస్తోంది. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ర్యాలీతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దసరా, నవరాత్రి ఉత్సవాల కారణంగా తాత్కాలికంగా ఆగిన ఈ ఆందోళనలను మళ్లీ వేగవంతం చేసేందుకు విపక్ష నేతలు వరుస సమాలోచనలు జరుపుతున్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నడిబొడ్డున భారీ ప్రజా సమీకరణతో పాటు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయకోవిదులతో ఒక ‘మాక్ పార్లమెంట్’ నిర్వహించి ఆయనపై అభిశంసన ప్రక్రియను ప్రదర్శించాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణను పర్యవేక్షించేందుకు విపక్ష కూటమి త్వరలోనే ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనుంది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అక్టోబర్ రెండో వారంలో విపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. అక్టోబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సీఈసీ రాజీనామాతో పాటు ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.3 కోట్ల మంది ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 12న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించి, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
రామ్‌లీలా మైదానంలో నిర్వహించబోయే ర్యాలీలో విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం అన్ని వర్గాలను ఏకం చేస్తూ ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేయాలన్నది ప్రతిపక్షాల ప్రధాన వ్యూహం. ఈ నిరసనల రూపురేఖలపై భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా అంతిమ నిర్ణయం తీసుకోనున్నాయి.
ఇదీ చదవండి: ష్రాఫ్ కాల్పుల కేసు: ఆమిర్, రణ్‌బీర్ ఇళ్ల వద్దా రెక్కీ..


