ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలోని జుహులో జరిగిన కాల్పుల ఘటన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన షూటర్లు కేవలం సల్మాన్ ఖాన్ నివాసం వద్దే కాకుండా, నటులు ఆమిర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా సోనిపట్‌లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది.
పోలీసుల విచారణలో నిందితులు ఫూల్ సింగ్, రెహాన్ అన్సారీలు మాట్లాడుతూ.. టైగర్ ష్రాఫ్ తమ అసలు టార్గెట్ కాదని వెల్లడించారు. తాము తొలుత లక్ష్యంగా చేసుకున్న ప్రముఖుల వద్ద భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉండటంతో ఆ ప్రణాళికను విరమించుకున్నామని, టైగర్ ష్రాఫ్‌కు సరైన భద్రతా రక్షణ లేకపోవడం వల్లే అతడిపై దాడికి దిగినట్లు వారు తెలిపారు.
హర్యానాకు చెందిన 18 ఏళ్ల ఈ ఇద్దరు షూటర్లు అక్టోబర్ దాడి చేయడానికి ముందు దాదాపు నెల రోజుల పాటు ముంబైలోని దాదర్ ప్రాంత లాడ్జీల్లో బస చేశారు. దాడికి వారం రోజుల ముందు (అక్టోబర్ 11న) టైగర్ ష్రాఫ్ క్రమం తప్పకుండా ఫుట్‌బాల్ ఆడే జుహు మైదానాన్ని కూడా వీరు సందర్శించారు. అమృత్‌సర్ నుంచి తెచ్చిన పిస్టళ్లను ఇద్దరు మహిళలు ముంబైకి చేరవేసి వీరికి అందించగా, దాడికి ముందు రోజు వాటిని ఒక అటవీ ప్రాంతంలో పరీక్షించినట్లు తెలిపారు.
ఈ కాల్పుల ఘటనలో వ్లాగర్ ఉమేష్ చౌహాన్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. టైగర్ ష్రాఫ్ డ్రైవర్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రధాన నిందితులను అక్టోబర్ 31 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించగా, ఆయుధాల సరఫరాదారులు, బిష్ణోయ్ ముఠాలోని ప్రధాన కుట్రదారులపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: హ్యూమన్ రైటర్‌కు ఆంత్రోపిక్ రూ. 3.2 కోట్ల ప్యాకేజీ!


