వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఉన్న ‘ఆంత్రోపిక్’ సంస్థ మనిషి ఆలోచనలకు, రాతకు పెద్దపీట వేస్తోంది. తమ ఏఐ మోడల్ ‘క్లాడ్’ క్షణాల వ్యవధిలోనే ప్రసంగాలు, వ్యాసాలు రూపొందించగల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, నిజమైన భావోద్వేగంతో కూడిన కమ్యూనికేషన్‌కు మానవ స్పర్శ (Human Touch) తప్పనిసరి అని ఆంత్రోపిక్ చెబుతోంది.
ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసేందుకు పూర్తి స్థాయి ‘ఎగ్జిక్యూటివ్ కమ్యూనికేషన్స్ రైటర్’ నియామకం కోసం ప్రకటన విడుదల చేసింది. సరైన అర్హత కలిగిన అభ్యర్థికి ఏడాదికి $295,000 (సుమారు రూ. 2.78 కోట్లు) నుండి $345,000 (సుమారు రూ. 3.25 కోట్లు) వరకు భారీ వేతనాన్ని చెల్లించేందుకు కంపెనీ సిద్ధమైంది. లింక్డ్‌ఇన్‌లో ఇచ్చిన ఉద్యోగ ప్రకటన ప్రకారం, ఈ బాధ్యతలను నిర్వర్తించేందుకు కనీసం ఎనిమిది సంవత్సరాల ఉన్నత స్థాయి అనుభవం ఉన్న అభ్యర్థులను కంపెనీ అన్వేషిస్తోంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అంశాలను వెంటనే అర్థం చేసుకుని, సంస్థ ఉన్నతాధికారుల ఆలోచనలను ప్రజలకు, భాగస్వాములకు స్పష్టంగా చేరవేయగల సామర్థ్యం అభ్యర్థికి ఉండాలి. విమర్శనాత్మక సమయాల్లోనూ, వేగవంతమైన పరిణామాల మధ్య సంయమనంతో పనిచేయడం అత్యంత కీలకమని కంపెనీ తెలిపింది. ఎంపికైన అభ్యర్థి సంస్థ ఎగ్జిక్యూటివ్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతితో, ఇతర నాయకత్వ బృందంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. పరిశోధన, మార్కెట్ నాయకత్వం, ప్రజా ప్రయోజనాల పట్ల సంస్థకున్న నిబద్ధతను తెలియజేసేలా కంటెంట్‌ను రూపొందించడం వీరి ముఖ్య విధి.
దీంతో పాటు డ్రాఫ్టింగ్, ఎడిటింగ్, కీలక కార్యక్రమాల్లో (ఈవెంట్లలో) ఆన్-సైట్ సహకారం అందించడం, తాజా వార్తా పరిణామాలపై నాయకత్వం తరఫున స్పందనలను సిద్ధం చేయడం వంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణ రచనే కాకుండా, లోతైన సాంకేతిక అవగాహన ఉన్న నిపుణులకు సైతం అర్థమయ్యే రీతిలో క్లిష్టమైన అంశాలను మలిచే సామర్థ్యం ఉండాలని సంస్థ పేర్కొంది. ఏఐ యుగంలో ఎగ్జిక్యూటివ్ కమ్యూనికేషన్ సరికొత్త దృక్పథంతో ఉండాలని, భవిష్యత్ దృష్టి ఉన్న అభ్యర్థులు తమకు అవసరమని సంస్థ వివరించింది. ఇక అమెరికా వీసా సంబంధిత అనిశ్చితుల దృష్ట్యా, వీసా స్పాన్సర్‌షిప్ అంశంలో కంపెనీ అన్ని విధాలా ప్రయత్నిస్తుందని, అయితే ముందస్తుగా ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేమని నిబంధనల్లో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ‘నేనేమీ ఏజెంట్‌ను కాదు’.. రాహుల్ టూర్‌పై థరూర్ వ్యాఖ్యలు


