తీసుకున్న జీతం వెనక్కివ్వాల్సిందేనా?.. బ్యాంక్ మాజీ సీఈఓకు షాక్‌! | IndusInd Bank terminated former CEO Sumant Kathpalia seeking his salary back | Sakshi
Sakshi News home page

తీసుకున్న జీతం వెనక్కివ్వాల్సిందేనా?.. బ్యాంక్ మాజీ సీఈఓకు షాక్‌!

Nov 22 2026 6:10 PM | Updated on Nov 22 2026 6:13 PM

IndusInd Bank terminated former CEO Sumant Kathpalia seeking his salary back

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్‌ఇండ్ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సుమంత్ కాథపాలియాకు భారీ షాక్ ఇచ్చింది. ఆయన ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేయడంతో పాటు, 2020 మార్చి నుంచి ఆయనకు చెల్లించిన వేతనంపై 'మాలస్‌, క్లాబ్యాక్‌' నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. అంటే గతంలో చెల్లించిన వేతనంలో అర్హమైన మొత్తాన్ని తిరిగి రాబట్టడంతో పాటు, చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను నిలిపివేసే అవకాశం ఉంది.

ఈ మేరకు నవంబర్ 20న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నియమించిన విచారణ అధికారి నవంబర్ 18న నివేదిక సమర్పించారు. ఈ నివేదికలోని అంశాలను పరిశీలించిన అనంతరం బోర్డు ఈ చర్యలు చేపట్టింది. అయితే విచారణ నివేదికలోని పూర్తి వివరాలను, కాథపాలియా నుంచి ఎంత మొత్తాన్ని తిరిగి వసూలు చేయనున్నదీ బ్యాంక్ వెల్లడించలేదు.

రూ.1,960 కోట్ల అకౌంటింగ్ వ్యత్యాసాలు..

2025 మార్చిలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ డెరివేటివ్ లావాదేవీల అకౌంటింగ్‌లో భారీ వ్యత్యాసాలను గుర్తించింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక నివేదికలు, అంతర్గత నియంత్రణ వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. ఈ వ్యత్యాసాల వల్ల బ్యాంక్ నికర విలువపై సుమారు రూ.1,960 కోట్ల ప్రతికూల ప్రభావం పడినట్లు అంచనా. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ ప్రభావం సుమారు 230 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,900 కోట్లకు పైగా). ఈ పరిణామం బ్యాంక్ షేర్లలో భారీ పతనానికి, నియంత్రణ సంస్థల పరిశీలనకు దారితీసింది.

ఈ పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ కాథపాలియా 2025 ఏప్రిల్ 29న సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించిన బ్యాంక్ బోర్డు, తదుపరి సమాచారం ఇచ్చే వరకు ఉద్యోగిగా కొనసాగుతారని తెలిపింది. అనంతరం అంతర్గత క్రమశిక్షణా చర్యలు ప్రారంభించి, 2025 జూన్ 18 నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.

ఏమిటీ మాలస్‌, క్లాబ్యాక్‌ నిబంధనలు?

బ్యాంకింగ్ రంగంలో ఉన్నతాధికారుల బాధ్యతను నిర్ధారించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. మాలస్‌ నిబంధన ద్వారా ఇంకా చెల్లించని బోనస్‌లు, ప్రోత్సాహకాలను తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. క్లాబ్యాక్‌ ద్వారా ఇప్పటికే చెల్లించిన అర్హమైన ప్రోత్సాహకాలు, వేతన సంబంధిత మొత్తాలను తిరిగి వసూలు చేయవచ్చు. కాథపాలియా విషయంలో ఈ నిబంధనలను ఆయన 2020 మార్చి 24న సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి వర్తింపజేయాలని బ్యాంక్ నిర్ణయించింది.

మరోవైపు, ఈ అకౌంటింగ్ వ్యవహారంపై గతంలోనే మాజీ డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా నుంచి కూడా వేతనాలు, బోనస్‌లను తిరిగి పొందే ప్రక్రియను బ్యాంక్ ప్రారంభించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. తాజా నిర్ణయంతో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న అకౌంటింగ్ వివాదంపై క్రమశిక్షణా చర్యలు మరో కీలక దశకు చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement