లేబర్‌ కోడ్‌.. ఏడాదిలో కార్మికులకు ఒనగూరింది ఎంత? | India Labour Codes Complete One Year What Has Changed for Workers | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌.. ఏడాదిలో కార్మికులకు ఒనగూరింది ఎంత?

Nov 21 2026 11:00 AM | Updated on Nov 21 2026 11:00 AM

India Labour Codes Complete One Year What Has Changed for Workers

దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్మిక చట్టాల వ్యవస్థను సమూలంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర​్‌ కోడ్‌ల అమలుకు ఏడాది పూర్తయింది. 2025 నవంబర్ 21న అమల్లోకి వచ్చిన ఈ సంస్కరణలు కార్మిక సంక్షేమం, వేతనాల చెల్లింపు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, పని ప్రదేశాల్లో భద్రతకు సంబంధించి కీలక మార్పులకు శ్రీకారం చుట్టాయి. అయితే చట్టాలు అమల్లోకి వచ్చినంత మాత్రాన వాటి ప్రయోజనాలు దేశవ్యాప్తంగా సమానంగా అందుతున్నాయని చెప్పలేము. కేంద్ర నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రాల స్థాయిలో నిబంధనల అమలు, గిగ్‌ కార్మికులకు సామాజిక భద్రత, జాతీయ కనీస వేతన విధానం వంటి అంశాలు ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. మరోవైపు ఈ సంస్కరణలపై కార్మిక సంఘాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. అవి వేతనాల కోడ్‌–2019, పారిశ్రామిక సంబంధాల కోడ్‌–2020, సామాజిక భద్రత కోడ్‌–2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌–2020. వీటి ప్రధాన ఉద్దేశం కార్మికులకు కనీస వేతన హక్కును కల్పించడం, ఉద్యోగుల సామాజిక భద్రతను విస్తరించడం, యాజమాన్యాలకు అనుసరణ ప్రక్రియలను సరళీకరించడం, ఉద్యోగ కల్పనకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడం.

ఉద్యోగులకు కీలక ప్రయోజనాలు

కొత్త కోడ్‌ల ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనం, నిర్ణీత గడువులో వేతనాల చెల్లింపు చట్టబద్ధ హక్కులుగా మారాయి. సంఘటిత, అసంఘటిత రంగాలతోపాటు గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడానికి చట్టపరమైన మార్గం ఏర్పడింది. 10 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలకు ఈఎస్‌ఐసీ వర్తింపును తప్పనిసరి చేయడంతోపాటు, ప్రమాదకర కార్యకలాపాలు నిర్వహించే సంస్థల్లో ఒక్క ఉద్యోగి ఉన్నా ఈఎస్‌ఐసీ పరిధి వర్తించేలా నిబంధనలు రూపొందించారు. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు ఈపీఎఫ్‌ఓ పరిధిని వర్తింపజేసే నిబంధనలూ ఉన్నాయి.

ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వడం, వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, తొలగింపునకు గురైన కార్మికులకు తిరిగి నైపుణ్య శిక్షణ కల్పించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఈ సంస్కరణల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మహిళలు తమ సమ్మతి, భద్రతకు సంబంధించిన నిబంధనలకు లోబడి రాత్రి వేళల్లోనూ అన్ని రకాల సంస్థల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. అంతర్రాష్ట్ర వలస కార్మికుల నిర్వచనాన్ని విస్తరించి స్వయంగా వలస వచ్చి పనిచేసేవారినీ చేర్చారు. వీరికి వార్షిక ప్రయాణ భత్యం, ప్రయోజనాల బదిలీ సౌకర్యాలను కల్పించే నిబంధనలున్నాయి.

రాష్ట్రాల సమన్వయమే సవాలు

కార్మిక కోడ్‌లను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2026 మేలో నాలుగు కోడ్‌లకు సంబంధించిన కేంద్ర నిబంధనలను నోటిఫై చేసింది. కార్మిక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో 2026 కేంద్ర నిబంధనలతోపాటు వివిధ అమలు ఉత్తర్వులు, అధికారుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌స్పెక్టర్‌ కమ్‌ ఫెసిలిటేటర్లు, అప్పీలేట్‌ అధికారులు, సర్టిఫైయింగ్‌ అధికారులు, రిజిస్ట్రేషన్‌ అధికారుల నియామకం ద్వారా అమలు వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టింది.

అయితే కార్మిక అంశం ఉమ్మడి జాబితాలో ఉండటంతో కేంద్రం రూపొందించిన నిబంధనలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో అవసరమైన నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన అమలు విధానం తీసుకురావడం కీలకంగా మారింది. నవంబర్‌ 21, 22 తేదీల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక, ఉపాధి, పరిశ్రమల మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలు స్థితిగతులు, భవిష్యత్‌ కార్యాచరణ, రాష్ట్రాల మధ్య సమన్వయం ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలు.

గిగ్‌ కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టి

స్విగ్గీ, జొమాటో.. వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై పనిచేసే గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం కొత్త కార్మిక వ్యవస్థలో కీలకమైన అంశం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 30, 2026న అసంఘటిత కార్మికులు, గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ బోర్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతోపాటు యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, అగ్రిగేటర్లు, పౌర సమాజ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు.

వివిధ వర్గాల కార్మికులకు తగిన సంక్షేమ పథకాలను రూపొందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం, ఇప్పటికే అమల్లో ఉన్న సామాజిక భద్రతా పథకాల పురోగతిని సమీక్షించడం ఈ బోర్డు ప్రధాన బాధ్యతలు. అయితే బోర్డు ఏర్పాటు ఒక్కటే సరిపోదు. గిగ్‌ కార్మికులకు బీమా, ఆరోగ్య రక్షణ, పెన్షన్‌, ప్రమాద పరిహారం వంటి ప్రయోజనాలు వాస్తవంగా అందేలా నిర్దిష్ట పథకాలు, నిధుల సమీకరణ, అమలు యంత్రాంగం అవసరం.

ఈపీఎఫ్‌ఓలోనూ మార్పులు

కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేసే క్రమంలో ఈపీఎఫ్‌ఓలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవంబర్‌ 19న జరిగిన ఈపీఎఫ్‌ మండలి 240వ సమావేశంలో పీఎఫ్‌ సభ్యులకు సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనివల్ల పదవీ విరమణ అనంతరం మొత్తం పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా, నిర్ణీత వ్యవధుల్లో వాయిదాల రూపంలో పొందే అవకాశం కలగనుంది. అయితే దీనికి సంబంధించి అవసరమైన పథక సవరణలు, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది.

ముందున్న సవాళ్లు

నాలుగు లేబర్‌ కోడ్‌ చట్టాల అమలును నిబంధనల నోటిఫికేషన్‌తో కొలవలేం. కార్మికులకు వాస్తవంగా వేతనాలు పెరుగుతున్నాయా? సామాజిక భద్రత పరిధిలోకి కొత్తగా ఎంతమంది వస్తున్నారు? చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అనుసరణ భారం తగ్గుతోందా? మహిళలకు సురక్షితమైన పని వాతావరణం ఏర్పడుతోందా? గిగ్‌ కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలు అందుతున్నాయా? అన్న అంశాలే అసలైన కొలమానాలు. కార్మిక సంఘాల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలను, ఆందోళనలను పరిష్కరిస్తూనే క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచాల్సి ఉంది.

ఇదీ చదవండి: పాదరసం నుంచి బంగారం తయారీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement