ఎంకే స్టాలిన్‌కు మరో పరీక్ష.. ! | MK Stalin Second Coming Kolathur Conqueror Dead | Sakshi
Sakshi News home page

ఎంకే స్టాలిన్‌కు మరో పరీక్ష.. !

Nov 21 2026 10:49 AM | Updated on Nov 21 2026 10:50 AM

MK Stalin Second Coming Kolathur Conqueror Dead

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు షాకిచ్చిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్‌ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. స్టాలిన్‌ను ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా నిలిచిన బాబు మరణంతో ఇప్పుడు కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. దీంతో అక్కడ జరగనున్న ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా స్టాలిన్‌ మరోసారి కొలత్తూరు నుంచి పోటీ చేస్తారా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

2011 నుంచి కొలత్తూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంకే స్టాలిన్‌.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగిన వీఎస్‌ బాబు ఘన విజయం సాధించారు. మరోవైపు, సినీ నటుడు విజయ్‌ స్థాపించిన టీవీకే చేతిలో డీఎంకే అధికారం కోల్పోవడంతో పార్టీకి ఈ ఎన్నికలు తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి.

బాబు మరణంతో ఖాళీ అయిన కొలత్తూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం ప్రకటించే షెడ్యూల్‌ ప్రకారం ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ డీఎంకే శ్రేణుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. డీఎంకే ఎంపీ సి. రవీంద్రన్‌ సైతం ఈ అంశంపై స్పందించారు. కొలత్తూరు నుంచి మళ్లీ పోటీ చేయాలా వద్దా అన్నది పూర్తిగా స్టాలిన్‌ వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే పార్టీ కార్యకర్తగా ఆయన మళ్లీ పోటీ చేయాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

‘‘ఇది మా నాయకుడి నియోజకవర్గం. నిర్ణయం ఆయనదే. ఆయనే తుది నిర్ణయం తీసుకోవాలి. అయితే డీఎంకే కార్యకర్తగా చెబుతున్నా.. ఆయన మళ్లీ పోటీ చేస్తే మాకు ఎంతో సంతోషం' అని రవీంద్రన్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీఎస్‌ బాబుకు 82,997 ఓట్లు పోలవగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు వచ్చాయి. దీంతో 8,795 ఓట్ల మెజారిటీతో బాబు విజయం సాధించారు. 2011 నుంచి వరుసగా కొలత్తూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టాలిన్‌ విజయ పరంపరకు ఈ ఫలితం తెరదించింది.

వీఎస్‌ బాబు తొలుత డీఎంకేలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఆ పార్టీ చెన్నై (నార్త్‌) జిల్లా కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పురసైవాక్కం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011 వరకు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్‌ స్థాపించిన టీవీకేలో చేరి కొలత్తూరు నుంచి పోటీ చేశారు. స్టాలిన్‌ను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు.

కొలత్తూరు ఉప ఎన్నిక డీఎంకేకు కోల్పోయిన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు ఓ అవకాశంగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత స్టాలిన్‌ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తే అది రాజకీయంగా కీలక పరిణామమే అవుతుంది. అయితే మరోసారి ఓటమి ఎదురైతే ఆయన రాజకీయ ప్రతిష్టకు మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

మరో వైపు, అసెంబ్లీ ఎన్నికల్లో తమకు భారీ విజయాన్ని అందించిన కొలత్తూరు స్థానాన్ని నిలబెట్టుకోవడం టీవీకేకు సవాలుగా మారనుంది. విజయ్‌ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో ఈ ఉప ఎన్నిక మరోసారి పరీక్షించనుంది. మరి స్టాలిన్‌ రెండోసారి కొలత్తూరు బరిలోకి దిగుతారా? లేక టీవీకే మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా? అన్నది వేచి చూడాలి.

ఇదీ చదవండి: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్‌.. 15 మందిపై వేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement