బీజేపీకి ఊహించని షాక్‌.. కాంగ్రెస్‌ భారీ విజయం | Congress Wins major victory Rajasthan rural elections over BJP Rule | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఊహించని షాక్‌.. కాంగ్రెస్‌ భారీ విజయం

Nov 21 2026 9:20 AM | Updated on Nov 21 2026 9:20 AM

Congress Wins major victory Rajasthan rural elections over BJP Rule

జైపూర్: రాజస్థాన్ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం.. 37 జిల్లా పరిషత్ స్థానాలకు గాను కాంగ్రెస్ 25 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లగా, బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది.

రాష్ట్రంలోని 37 జిల్లాలకు గాను 33 జిల్లాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 1,271 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ 794 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 357 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. అలాగే 7,520 పంచాయతీ వార్డుల ఫలితాలు వెల్లడికాగా కాంగ్రెస్ 3,758 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 2,213 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు నాలుగు జిల్లాల్లో ఫలితాలను అధికారులు వాయిదా వేశారు. ఈ ఫలితాలను డిసెంబరు 17న ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ గ్రామీణ స్థానిక సంస్థల ఫలితాలు బీజేపీ ప్రభుత్వానికి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం డిసెంబరుతో మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సాధించిన ఆధిక్యాన్ని రాజకీయ వర్గాలు కీలక పరిణామంగా విశ్లేషిస్తున్నాయి.

ప్రతి గ్రామం గొంతుక ఇదే: రాహుల్ గాంధీ
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నెరవేర్చని హామీలకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని కాంగ్రెస్ అభివర్ణించింది. అధికారంలో ఉన్నవారి అహంకారాన్ని ప్రజలు సహించబోరనే సందేశాన్ని ఈ ఫలితాల ద్వారా ప్రధాని మోదీకి ఇచ్చారని పేర్కొంది. ఈ తీర్పు కేవలం రాజస్థాన్‌కే పరిమితం కాదని, దేశంలోని ప్రతి గ్రామం గొంతుక అని రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ దుష్పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.

పనితీరు మెరుగుపరచుకుంటాం: బీజేపీ
మరోవైపు ఎన్నికల ఫలితాలపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మదన్ రాఠోడ్ స్పందించారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ ఫలితాలు పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు, పనితీరును మెరుగుపరచుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తంగా రాజస్థాన్ గ్రామీణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఉత్సాహాన్నివ్వగా, అధికార బీజేపీకి మాత్రం రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలపై మరింత దృష్టి సారించాల్సిన పరిస్థితిని సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్‌.. 15 మందిపై వేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement