సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్య... బుల్లెట్ దిగిందా లేదా? అనేదే ముఖ్యం... రాజకీయాల్లో అయినా.. సినిమా ఇండస్ట్రీలో అయినా.. ఆటల్లో అయినా... ఇదే కాన్సెప్ట్ ప్రస్తుతం నడుస్తోంది. నేను నలభయ్యేళ్లుగా టీడీపీకి సేవ చేస్తున్నాను.. కాబట్టి నాకే పదవి వస్తుంది అని ఎవరైనా ఆశల్లో ఉంటే చంద్రబాబు కుటిల రాజకీయాల ముందు అది అడియాశే అని అర్థమయ్యే పరిస్థితి. నువ్వు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నావన్నది కాదు... పార్టీ పెద్దలను ఎంత త్వరగా ప్రసన్నం చేసుకున్నాం అన్నదానిని బట్టి నీకు పదవీయోగం ఉంటుందనేది ఇప్పుడిప్పుడే టీడీపీ సీనియర్ నాయకులకు అర్ధం అవుతోంది.
పదవి దక్కడానికి సీనియారిటీ... విధేయత మాత్రమే కాదు ఇంకా చాలా లెక్కలు ఉంటాయని టీడీపీ సీనియర్లకు స్పష్టమైంది. సరిగ్గా రెండు నెలల కిందట పార్టీలో చేరిన జెడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఇలా వెళ్లి అలా మళ్లీ జెడ్పీ చైర్మన్ పదవితో బయటకు వచ్చేశారు. కాకుంటే గతంలో ఆయన చేసిన పదవిని ఈసారి తన కుమార్తె సిరిసహస్రకు తెచ్చుకొన్నారు. దీంతో టీడీపీ సీనియర్లు కక్కలేక మింగలేక లోలోన కు(ళ్లి)మిలిపోతూ బయటకు నవ్వుతున్నారు. చాన్నాళ్లుగా టీడీపీలోనే ఉన్నాం... ఈసారి పదవి మాకే వస్తుంది అని భావించిన వాళ్లందరూ ఈ రేసులో వెనక్కి వెళ్లిపోగా అనూహ్యంగా సిరిసహస్ర లైన్‌లో ముందుకు వచ్చేసి ఏకంగా చైర్మన్ కుర్చీలో కూర్చోవడం టీడీపీ నేతలకు అర్థం కావడం లేదు.
ఆశపడ్డారు కానీ...
జెడ్పీ చైర్మన్ గిరి తమకు దక్కాలని జిల్లాలోని సీనియర్ టీడీపీ నాయకులు తమ కుటుంబీలను జెడ్పీటీసీ బరిలో దింపారు. కొన్ని స్థానాల్లో తెరచాటు రాజకీయాల కారణంగా సీనియర్లకు షాకిచ్చేలా ఫలితాలు రావడంతో జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు వదులుకోగా, మరికొన్ని చోట్ల గెలిచినా అధిష్టానం ముందు వారి ప్రయత్నాలు సరిపోని పరిస్థితిలో వారం రోజుల ముందే సైలెంట్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతోపాటు జిల్లా మంత్రి తన నియోజకవర్గంలోని జెడ్పీటీసీకి చైర్మన్ పదవి ఇప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేసినా అధిష్టానం వద్ద అవి ఫలించక లోలోన రగిలిపోతున్నారు.
సమావేశానికి దూరంగా ఎమ్మెల్యేలు
జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు జిల్లాకు చెందిన పలువురు కూటమి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సొంత పనులపై బయట ప్రాంతాలకు వెళ్లినట్టు ప్రచారం చేసుకుంటున్నా... కావాలనే చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఇన్నాళ్లూ టీడీపీని దూషించే వ్యక్తి... పార్టీలోకి రాగానే పెద్దపీట వేయడం, ఆయన కుమార్తెకు జెడ్పీచైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టడంపై అయిష్టత చూపుతున్నట్టు సమాచారం. సిరిసహస్ర ఓసీ వర్గానికి చెందినదని, బీసీ కాదంటూ కోర్టులో కేసు నడుస్తుండగా పదవిని అప్పగించిన అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు దూరంగా ఉన్నవారిలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో పాటు, రాజాం ఎమ్మెల్యే కోండ్రుమురళీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉన్నారు.
టీడీపీ నేతలకు షాక్
వాస్తవానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో జిల్లాలోని బీసీల్లో పెద్ద సామాజిక వర్గానికి చెందిన తూర్పు కాపు లేదా కొప్పల వెలమ మహిళకు ఈ పదవి దక్కుతుందని చాలామంది ఊహించారు. ముఖ్యంగా జిల్లాలోని టీడీపీ సీనియర్లు ఈసారి కీలకమైన జెడ్పీ చైర్మన్ గిరిని తన్నుకుపోదామని ఆశపడ్డారు. అయితే, వారి ఆశలకు గండికొడుతూ బీసీ కోటాలో సిరిసహస్ర ఈ పదవిని తన్నుకుపోవడంతో వారికి ఏం చేయాలో దిక్కుతోచక సైలెంట్ అయిపోయారు. మరోవైపు ఆమె బీసీ కాదంటూ కోర్టులో కేసులు నడుస్తుండగానే టీడీపీ అధిష్టానం ఏకంగా ఆమెకు కీలక పదవి కట్టబెట్టడం కాపు, వెలమ నాయకులకు మింగుడుపడక, అసలేం జరుగుతోందో అర్థంకాని విషయం అయింది. ఇన్ని వివాదాల నడుమ ఆమెకు ఎందుకు పదవి ఇచ్చారనేది తెలియక పాతకాపులు, ఫార్టీ ఇయర్స్ పెద్దలు నెత్తి కొట్టుకుంటున్నారు.

బీసీ మహిళకు పదవికి దక్కిందా..?
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీ మహిళకు దక్కాల్సి ఉండగా ఆ ప్రక్రియ సక్రమంగా జరగలేనందున ఈ సమావేశాన్ని బహిష్కరించినట్టు గరివిడి జెడ్పీటీసీ సభ్యురాలు బొత్స పూజిత స్పష్టంచేశారు. జిల్లాలో అనేక మంది బీసీ మహిళా జెడ్పీటీసీలు ఉన్నా వారిని కాదని, బీసీ కాని వారికి, కుల వివాదం కోర్టులో నడుసున్నా ఏకపక్షంగా మరొకరికి ఈ పదవిని కట్టబెట్టడంతో బాయ్‌కాట్ చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని మీడియాలో చూస్తున్నారు.. వారికి అంతా తెలుసన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గుర్ల, జామి, నెల్లిమర్ల, గజపతినగరం జెడ్పీటీసీ సభ్యులు ఎస్.వెంకటలక్ష్మి, యర్ని తులసి త్రివేణి, మత్స విజయ, మండల సూర్యకళ, తదితరులు పాల్గొన్నారు.
బీసీ మహిళలకు అన్యాయం
విజయనగరం రూరల్: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికలు రిగ్గింగులు, దౌర్జన్యాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిర్వహించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు మండిపడ్డారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ ప్రత్యేక సమావేశానికి హాజరైన ఆయన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సమావేశాన్ని బహిష్కరిస్తూ జెడ్పీటీసీలతో పాటు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడీయాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్యయుతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదన్నారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని, చైర్మన్ ఎన్నికను బహిష్కరించినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: కొందామా... వేచి చూద్దామా!


