విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లు శుక్రవారం పయనమయ్యాయి. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు చిత్తూరు జిల్లా పుత్తూరులో అండర్ – 19 ఫుట్‌బాల్ పోటీలతో పాటు ఈ నెల 21, 22 తేదీల్లో అండర్ – 19 విభాగంలో బాల, బాలికలకు స్విమ్మింగ్ పోటీలు, ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు జరగబోయే అండర్ – 17 బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనుండగా... మూడు విభాగాల నుంచి సుమారు 90 మంది క్రీడాకారులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరికి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు ఆర్.వాణిశ్రీ, బి.శ్రీనివాస్‌లు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవటం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవటంతో పాటు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయా జట్లకు కోచ్ అండ్ మేనేజర్‌తో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


