రాజాం సిటీ: మండల పరిధి పెనుబాక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొనపల బద్రి తన నిజాయితీ చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగు, అందులోని బంగారం పోలీసులకు అప్పగించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలం పుర్రేయవలస గ్రామానికి చెందిన లంకలపల్లి సంధ్యారాణి పార్వతీపురంలోని బంధువుల ఇంట్లో పెళ్లికి శుక్రవారం బయలుదేరింది. చీపురుపల్లిలో ఆటో ఎక్కిన ఆమె రాజాం బస్టాండ్‌లో దిగింది. తనతో పాటు తీసుకువచ్చిన నాలుగున్నర తులాల బంగారు హారం, నక్లెస్ ఉన్న బ్యాగు ఆటోలో మర్చిపోయి అక్కడే ఉన్న పోలీసులను ఆశ్రయించింది. వెంటనే ఆటో కోసం వెతుకుతుండగా బస్టాండ్ నుంచి కొంతదూరం వెళ్లిన ఆటో డ్రైవర్ ఆటోలో బ్యాగును గుర్తించి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించాడు. టౌన్ సీఐ డి.నవీన్‌కుమార్ సమక్షంలో బాధిత మహిళ సంధ్యారాణికి అందజేశారు. ఆటో డ్రైవర్‌ను మహిళతో పాటు సీఐ, పోలీసు సిబ్బంది అభినందించారు.


