పార్వతీపురం: జిల్లాలోని నాన్ సిగ్నిల్(నెట్వర్క్)లేని గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రీసర్వే పురోగతిపై ఏడీ సర్వే, మండల, గ్రామ సర్వేయర్లు, సర్వే ఏజన్సీల ప్రతినిధులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న నెట్వర్క్, సాంకేతిక అడ్డంకులను ఏజెన్సీల సహకారంతో తక్షణమే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల వారీగా పెండింగ్ పనులను గుర్తించి అవసరమైన సిబ్బంది, పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ సర్వే సిబ్బంది, ఏజెన్సీ ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పురోగతి నివేదికలు సమర్పించాలని, నిర్దేశించిన గడువులోగా రీసర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.


