గంట్యాడ: మండలంలోని పెనసం గ్రామంలో బోధ రాఘవ అనే బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలుడు అదృశ్యమైన విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టినట్టు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
భామిని: మండలంలోని సింగిడికి చెందిన గుడ్ల చంద్రకిరణ్(26) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... చంద్రకిరణ్ గురువారం సింగిడిలోని తన స్వగృహంలో పురుగులు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. అక్కడ మృతి చెందాడు. మృతుడి తండ్రి గుడ్ల తిరుపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బత్తిలి ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, అన్నయ్య ఉన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గజపతినగరం: మండలంలోని ఎం.వెంకటాపురం గ్రామంలో నివాసం ఉంటున్న కొట్యాడ కిరణ్‌కుమార్(29) జియో టవర్ టెక్నీషియన్ ఈ నెల 11న ప్రమాదవశాత్తు రెండో అంతస్తు పైనుంచి జారిపడి గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు. మృతుడి సోదరి కొట్యాడ చంద్రిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
అడవి పంది మాంసం
తరలిస్తున్న ఇద్దరి పట్టివేత
పార్వతీపురం రూరల్: అడవి పంది మాంసం విక్రయించి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం తాళ్లబురిడిగ్రామ సరిహద్దు మెట్ట వద్ద పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అటవీ రేంజ్ అధికారి మణికంఠ, సెక్షన్ అధికారి ఎం.మనోజ్‌కుమార్, బీట్ అధికారులు, ఇతర అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
డెంకాడ: మండలంలోని మోదవలస వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బెల్లాం గ్రామానికి చెందిన మల్లపురెడ్డి జగన్(16) తగరపువలసలో ఒక బేకరీలో పని చేస్తున్నాడు. జగన్ జొన్నాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. తన పదో తరగతి మార్కుషీట్ తీసుకునేందుకు శుక్రవారం పాఠశాలకు వెళ్తుండగా మోదవలస వద్ద నడక మార్గంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.


