● కుంకీ ఏనుగులు వచ్చి ఐదు నెలలైనా మారని క్షేత్రస్థాయి పరిస్థితి
● బండిదోర వలస సమీపంలో మళ్లీ ఏనుగుల సంచారం
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఏనుగుల బెడద ప్రజలను, రైతులను నిరంతరం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం నాడు పార్వతీపురం మండల పరిధిలోని కృష్ణపల్లి పంచాయతీ బండిదోరవలస గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు మళ్లీ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని ప్రధాన హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మారని పరిస్థితులు
క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. కూటమి పాలకులు అధికారంలోకి వచ్చిన దాదాపు ఒకటిన్నర ఏడాది తర్వాత ఎట్టకేలకు రెండు కుంకి ఏనుగులను రప్పించారు. వీటి సహాయంతో ఏనుగుల గుంపును అటవీ ప్రాంతాలకు గానీ, గుచ్చిమి సమీపంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకుగానీ తరలిస్తామని ప్రకటించారు. అయితే కుంకి ఏనుగులు వచ్చి దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, అడవి ఏనుగుల తరలింపు ప్రక్రియ మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా ఏనుగుల గుంపు యథావిధిగా గ్రామాల సమీపంలో, పంట పొలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తోంది. ప్రభుత్వ తీరుపై గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సమస్య పూర్వస్థితిలోనే..!
ఏనుగులు ఏ గ్రామంలోకి ప్రవేశిస్తే ఆ గ్రామ ప్రజలు
ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. కుంకి ఏనుగులను రప్పించినా సమస్య పూర్వ స్థితిలోనే ఉండటంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప, క్షేత్రస్థాయిలో తమ కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు స్పందిస్తూ, ఏనుగుల గుంపు వల్ల పంట నష్టం జరిగితే అంచనా వేసి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఏనుగుల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి అపాయం కలగకుండా సురక్షితంగా వాటిని మళ్లిస్తున్నామని పేర్కొన్నారు. అయితే అధికారుల మాటలు ఎలా ఉన్నా, శాశ్వత పరిష్కారం దొరకకపోవడంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.


