కొందామా... వేచి చూద్దామా! | Gold Prices See Massive Crash In India | Sakshi
Sakshi News home page

కొందామా... వేచి చూద్దామా!

Nov 21 2026 7:53 AM | Updated on Nov 21 2026 7:56 AM

Gold Prices See Massive Crash In India

కర్నూలు(అగ్రికల్చర్‌): బంగారం ధరలు పడిపోతున్నాయ్‌.. కొందామా... ఇంకా ధరలు ఏ స్థాయికి పడిపోతాయో వేచి చూద్దామా.. అనే మీమాంసలో ప్రజలు ఉండిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆర్నమెంటు బంగారం ఒక దశలో 10 గ్రాముల ధర రూ.1.55 లక్షలు దాటిపోయింది. ధరలు ఇంకా ఏ స్థాయికి వెళ్తాయోనన్న భయంతో కొందరు కొనేసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గిపోతున్నాయి. 

శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,15,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,560కు చేరుకుంది. బంగారం ధరలు రోజురోజుకు తగ్గిపోతుండటం అన్ని వర్గాల ప్రజలకు ఆనందాన్ని ఇస్తోంది. అయితే ధరలు ఏ స్థాయికి తగ్గుతాయనే దానిపై వేచి చూడాలనే లక్ష్యంతో ఉన్నారు. తొందరపడి కొనరాదనే ధోరణిలో ప్రజలు ఉన్నారు. ధరలు తగ్గుతున్న వేళ కర్నూలు నగరంలోని కార్పొరేట్‌ దుకాణాలు, ఇతర బంగారం షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వేచి చూస్తున్నారని అందువల్లనే వ్యాపారం తగ్గిపోయిందని జ్యువెలరీ వ్యాపార వర్గాలు తెలిపాయి. కర్నూలు నగరంలో 10 వరకు కార్పొరేట్‌ బంగారం షాపులు ఉన్నాయి.

బంగారం విక్రయాల కోసం కర్నూలులో ప్రత్యేకంగా షరాఫ్‌ బజారు ఉంది. కొద్ది రోజులుగా వ్యాపారాలు 80 శాతం వరకు పడిపోయాయి. ధరలు తగ్గుతున్న వేళ...అత్యవసరం అయితే తప్ప బంగారం కొనడం లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. బంగారం ధరలు పెరిగిపోతున్న వేళ.. ధర ఏ స్థాయికి వెళ్తుందోనని సంపన్న వర్గాల ప్రజలు కొనుగోలు చేశారు. నేడు ధర నేల చూపు చూస్తుండటంతో వారు ఆందోళనలో మునిగిపోయారు. పెరుగుట విరుగుల కొరకే అనే పాత సామెత బంగారం విషయంలో నిజమైంది. వేగంగా పెరుగుతూ వెళ్లిన ధరలు ఒక్కసారిగా తగ్గుతుండటం చర్చనీయాంశమైంది. కనిష్టంగా 10 గ్రాముల ధర రూ.లక్షకు పడిపోయే అవకాశం ఉందని జ్యువెలరీ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement