కొనసాగిన బుల్‌ రన్‌... | Indian Stock Market Rally Sensex Nifty Gains | Sakshi
Sakshi News home page

కొనసాగిన బుల్‌ రన్‌...

Nov 21 2026 4:24 AM | Updated on Nov 21 2026 4:24 AM

Indian Stock Market Rally Sensex Nifty Gains

సెన్సెక్స్‌ 898 పాయింట్లు ప్లస్‌

25,800 స్థాయిపైకి నిఫ్టీ

బ్యాంకుల షేర్లలో కొనసాగిన ర్యాలీ

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలను విస్మరిస్తూ, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం ఒక శాతం లాభపడింది. ఐటీ షేర్లకు డిమాండ్‌తో పాటు బ్యాంకుల షేర్ల ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్‌ 898 పాయింట్లు పెరిగి 83,920 వద్ద ముగిసింది. నిఫ్టీ 286 పాయింట్లు ఎగసి 25,801 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు.

సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం (84,038) నుంచి 1,635 పాయింట్లు దూసుకెళ్లి 84,038 వద్ద, నిఫ్టీ సైతం కనిష్ట స్థాయి(25,345) నుంచి 464 పాయింట్లు ఎగసి 25,809 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల ఇండెక్సులు ఇంట్రాడేలో జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.

  • మార్కెట్‌ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి రూ.514.18 లక్షల కోట్లకు చేరింది.  నెల రోజుల్లో ఏకంగా రూ.46.25 లక్షల కోట్లు వృద్ధి చెందడం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్లకు ఏఐ షేర్ల సెగ..! 
ఏఐ దిగ్గజం ‘ఆంథ్రోపిక్‌’ షేర్లు  నాస్‌డాక్‌లో 17 శాతం లాభంతో 97.17 డాలర్ల వద్ద  లిస్టయ్యాయి. అయితే... ఏఐ రంగ భవిష్యత్తు, అధిక వాల్యుయేషన్లపై నెలకొన్న ఆందోళనలు ఈ  ఉత్సాహాన్ని మరుగున పడేశాయి. ‘ఏఐ ట్రేడ్‌’ జోరు తగ్గి, వాల్‌స్ట్రీట్‌తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, జపాన్‌ మార్కెట్లలోని ఏఐ, సెమీకండక్టర్‌ ఆధారిత షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. 

అమెరికాలో టెక్నాలజీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్‌ ఇండెక్స్‌ గురువారం  2.25 శాతం కుప్పకూలడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత టెక్నాలజీ షేర్లలో భారీ విక్రయాలు తలెత్తడంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. తైవాన్‌ (–6.3%), దక్షిణ కొరియా (–5.5%), జపాన్‌ (–5.3%), సింగపూర్‌ (–2.1%), భారీగా పతనమయ్యాయి. 

యూరప్‌లో జర్మనీ (–2.4%), ఫ్రాన్స్‌ (–1.63), బ్రిటన్‌ (–1.01%) క్షీణించగా.. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ∙కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు, ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహంతో గత 30 రోజుల్లో సెన్సెక్స్‌ 14%, నిఫ్టీ 13% లాభపడి ప్రపంచంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచాయి.

విదేశీ పెట్టుబడుల సునామీ
నవంబర్‌లో రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు:
దేశీయ స్టాక్‌ మార్కెట్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది. ప్రస్తుత నెలలో నవంబర్‌ 20 నాటికి ఎఫ్‌పీఐలు నికరంగా రూ.1.22 లక్షల కోట్ల ఈక్విటీలను కొన్నారు. అంతర్జాతీయంగా కృత్రిమ మేధ షేర్లలో విక్రయాల ఒత్తిడి, క్రూడాయిల్‌ ధరలు తగ్గడం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాయి.

అలాగే, దేశీ స్టాక్‌ మార్కెట్లో లార్జ్‌క్యాప్‌ కంపెనీల వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా ఉండటం కలిసొచ్చింది. భారత మార్కెట్‌ చరిత్రలోనే ఇది అత్యధిక నెలవారీ విదేశీ పెట్టుబడుల రికార్డు.  2020 నవంబర్‌లో నమోదైన రూ.60,358 కోట్ల రికార్డును ఇది రెట్టింపు స్థాయిలో అధిగమించింది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్‌ నుంచి రూ.1.17 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు.

ఇదీ చదవండి: వైద్య రంగంలో ఏఐ విప్లవం.. తెలుగు యువకుడి గ్లోబల్‌ విజన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement