ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల లాభం.. కారణాలు.. | Indian Stock Market Surges As Sensex Jumps 897 Points And Nifty Crosses 25,800, Key Reasons Behind The Rally, Check Out More Details | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల లాభం.. కారణాలు..

Nov 20 2026 4:10 PM | Updated on Nov 20 2026 4:39 PM

Sensex Surges 897 Points Nifty Jumps 286 to 25800 Reasons Behind Rally

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతపు ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా కొన్ని మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో సూచీలు దూసుకెళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 50 ఏకంగా 286 పాయింట్లు లాభపడి 25,800 స్థాయికి చేరగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 897 పాయింట్లు ఎగబాకి 83,919 వద్ద స్థిరపడింది. అంటే సుమారు ఒకశాతానికిపైగా(సుమారు రూ.4 లక్షల కోట్లు) మార్కెట్‌ పెరిగింది. ఈ ర్యాలీకి దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కారణంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, రూపాయి విలువ పెరుగుదల, ఐటీ–బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు, ముడిచమురు ధరల పరిణామాలు, మార్కెట్‌ సాంకేతిక సంకేతాలు కీలకంగా నిలిచాయి.

మార్కెట్‌ ర్యాలీకి కారణాలు

విదేశీ పెట్టుబడుల ప్రవాహం

ఇటీవల మార్కెట్‌ ర్యాలీకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు ఒక కారణంగా తోస్తున్నాయి. నవంబర్‌లో ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వచ్చాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నవంబర్‌లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు భారత షేర్లలో సుమారు 12.21 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు వరుసగా ఎదురైన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణల అనంతరం ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హెల్త్‌కేర్‌, వినియోగ రంగాల షేర్లలో విదేశీ నిధులు ప్రవేశించడం మార్కెట్‌కు మద్దతునిచ్చింది. నవంబర్‌ 19న ఒక్కరోజే ఎఫ్‌ఐఐలు రూ.7,411 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేయడం కొనుగోలుదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

రూపాయి బలోపేతం..

భారత రూపాయి విలువ పెరగడం మరో కీలక పరిణామం. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏడు నెలల గరిష్ఠానికి చేరి 93 స్థాయిని అధిగమించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడటం, ముడిచమురు ధరల ఒత్తిడి తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. రూపాయి బలపడటం వల్ల ముడిచమురు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు, ఇతర దిగుమతి ఆధారిత ముడిసరుకుల ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో దిగుమతులపై ఆధారపడే కంపెనీల లాభదాయకత మెరుగుపడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే విదేశీ ఇన్వెస్టర్లకు కరెన్సీ మారకపు నష్టాల భయం తగ్గుతుంది. ఇది మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తుంది.

ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు

సూచీల పెరుగుదలలో ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల వాటా గణనీయంగా ఉంది. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ప్రైవేట్‌ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల షేర్లలోనూ ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు.

బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి మెరుగైన రుణ వృద్ధి, ఆస్తుల నాణ్యతపై అంచనాలు, ఆర్థిక వ్యవస్థలో రుణ డిమాండ్‌ కొనసాగుతుందన్న విశ్వాసం కొనుగోళ్లకు దోహదం చేస్తున్నాయి. ఐటీ రంగంలోనూ అమెరికా, యూరప్‌ వంటి కీలక మార్కెట్ల నుంచి డిమాండ్‌ మెరుగుపడుతుందన్న ఆశాభావం కనిపిస్తోంది.

ముడిచమురు ధరల తగ్గుదల..

భారత్‌ ముడిచమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు దేశీయ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు నవంబర్‌లో గణనీయంగా తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా మారింది.

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న ఆశావాదం, మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలు మెరుగుపడతాయన్న అంచనాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ఒత్తిడిని తగ్గించాయి. చమురు దిగుమతి బిల్లు తగ్గితే దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. రవాణా, తయారీ, విమానయాన రంగాల నిర్వహణ వ్యయాలపైనా సానుకూల ప్రభావం పడుతుంది. ఈ పరిణామాలు పెట్టుబడిదారుల రిస్క్‌ తీసుకునే సామర్థ్యాన్ని పెంచాయి.

ఇదీ చదవండి: వీడ్కోలు చెప్పేందుకు రైలెక్కి రూ.36 వేల జరిమానా కట్టారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement