బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తన విలాసవంతమైన కార్ల కలెక్షన్‌లో మరో ఖరీదైన ఎస్‌యూవీని చేర్చుకున్నారు. బ్రిటిష్ లగ్జరీ ఆటోమొబైల్ దిగ్గజం ల్యాండ్ రోవర్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘డిఫెండర్ ఆక్టా’ను ఆయన కొనుగోలు చేశారు. ముంబై విమానాశ్రయం వద్ద షాహిద్ తన కొత్త కారును నడుపుతూ కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన డిఫెండర్ వేరియంట్ ఇదే కావడం విశేషం. ఈ వాహనం ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.42 కోట్లు కాగా ముంబైలో రిజిస్ట్రేషన్, ఇతర పన్నులతో కలిపి ఆన్‌రోడ్ ధర సుమారు రూ.3.04 కోట్ల వరకు ఉంటుందని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
షాహిద్ కపూర్ ఎంచుకున్న డిఫెండర్ ఆక్టా ప్రత్యేకమైన శాటిన్ ఫినిష్‌తో కూడిన చారెంటె గ్రే రంగులో ఆకట్టుకుంటోంది. దీనికి జతగా అమర్చిన గ్లాస్ బ్లాక్ 22 అంగుళాల అల్లాయ్ వీల్స్, నార్విక్ బ్లాక్ కాంట్రాస్ట్ రూఫ్ కారుకు మరింత గంభీరమైన రూపాన్ని ఇస్తున్నాయి. సాధారణ డిఫెండర్ మోడళ్లతో పోలిస్తే ఆక్టా ఎత్తు 28 మిల్లీమీటర్లు, వెడల్పు 68 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విభిన్నమైన ఫ్రంట్, రియర్ బంపర్లు, పెద్ద గ్రిల్, వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, క్వాడ్ ఎగ్జాస్ట్ పైపులు దీన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి.
అసాధారణ పనితీరు
డిఫెండర్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ప్రొడక్షన్ మోడల్‌గా నిలిచిన ఆక్టాలో 4.4 లీటర్ల ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. మైల్డ్ హైబ్రిడ్ సాంకేతికత సహాయంతో పనిచేసే ఈ ఇంజిన్ 635 పీఎస్ (626 bhp) గరిష్ఠ శక్తిని, 750 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తి అందుతుంది. దీని సాయంతో ఈ భారీ ఎస్‌యూవీ కేవలం నాలుగు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ధరల్లో మార్పులు
జేఎల్‌ఆర్ ఇండియా గతేడాది మార్చిలో డిఫెండర్ ఆక్టాను తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల చేసినప్పుడు దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.2.59 కోట్లుగా నిర్ణయించింది. అయితే, ఇటీవల పన్నుల సవరణలు, ల్యాండ్ రోవర్ ధరల సర్దుబాటు నేపథ్యంలో ప్రస్తుతం స్టాండర్డ్ డిఫెండర్ ఆక్టా ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.42 కోట్లకు అందుబాటులోకి వచ్చింది. కాగా, ఆక్టా బ్లాక్ ఎడిషన్ ధర రూ.2.62 కోట్లుగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ‘ప్రైవేటు బైక్ ట్యాక్సీకి అనుమతులివ్వండి’


