హైదరాబాద్: కొత్త కారుకు పూజ చేయించేందుకు ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం ఇద్దరు మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. బ్రేక్‌కు బదులు పొరపాటున యాక్సిలేటర్ తొక్కడంతో కారు ఒక్కసారిగా దూసుకెళ్లి కూరగాయల వ్యాపారిని, కొనుగోలుదారును బలంగా ఢీకొట్టింది. సోమవారం ఉదయం వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారాసిగూడ ఎస్ఐ రామంచందర్ రెడ్డి తెలిపిన మేరకు.. రాంనగర్‌కు చెందిన ధనుంజయ్ (36) ఇటీవలే కొత్త మారుతి వ్యాగన్ ఆర్ కారును కొనుగోలు చేశాడు. సోమవారం ఉదయం పూజ చేయించేందుకు స్థానిక పోచమ్మ దేవాలయం వద్దకు వచ్చాడు.
కారును ఆపిన తర్వాత హ్యాండ్ బ్రేక్ వేయకుండా ఇంజిన్ ఆన్‌లోనే ఉంచి కిందకు దిగాడు. దీంతో కారు నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభించింది. గమనించిన ధనుంజయ్ కారును ఆపేందుకు కంగారుగా లోపలికి ఎక్కి బ్రేక్ వేయబోయి పొరపాటున యాక్సిలరేటర్‌పై కాలు వేశాడు. దీంతో కారు ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న మానెమ్మ (35)ను, అక్కడే కూరగాయలు కొంటున్న ఉమాదేవి (24)ను ఢీకొట్టింది.
అనంతరం పక్కనే నిలిపి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి సమీపంలోని మెడికల్ షాప్ షట్టర్‌లోకి దూసుకెళ్లి ఆగింది. మానెమ్మ తలకు బలమైన గాయం కాగా ఉమాదేవి కాళ్లకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బైకులు, మెడికల్ షాప్ షట్టర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: టౌన్ ప్లానింగ్ అధికారిణి వాణి అక్రమాస్తులు రూ.25 కోట్ల!


