మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) గుండు వాణి అక్రమాస్తుల చిట్టా తవ్వినకొద్దీ బయట పడుతోంది. సోమ వారం అత్తాపూర్‌లోని ఆమె ఇళ్లు, ఆఫీసు, బందువులు, బినామీల ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రూ.6.75 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ సుమారు రూ.25 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.
సెప్టెంబర్ 30న ఓ ఇంటి నిర్మాణదారుని నుంచి సీనియర్ అసిస్టెంట్ ద్వారా డిమాండ్ చేయించి రూ.75 వేలు లంచం తీసుకుంటూ గుండు వాణి ఏసీబీకి దొరికారు. ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు పంపిన అధికారులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. తాజాగా జరిపిన సోదాల్లో పలు ప్లాట్లు, ఇళ్లు, భూములకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తుల చిట్టా ఇదే..
గుండు వాణికి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 283.11 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు ప్లాట్లు, కోయిల్‌కొండలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి, జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం, రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో ఒక నివాస ఫ్లాట్, జీ+2 అంతస్తుల భవనం ఉన్నాయి.
ఆమె తన అక్రమ సంపాదనను మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవానీ వైన్స్‌తోపాటు షేర్ మార్కెట్‌లోనూ పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తేల్చారు. ఇంట్లో రూ.5,47,500 క్యాష్, బ్యాంకు ఖాతాల్లో రూ.7.97 లక్షలు, 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు(మహీంద్రా ఎక్స్‌యూవీ700, హ్యుందాయ్ క్రేటా), 2 ద్విచక్రవాహనాలను గుర్తించారు. అనంతరం ఆమెను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.


