సీఐ నాగరాజుకు బెయిల్‌ ఇవ్వొద్దు | CBI Opposes Bail Plea Of Suspended CI Nagaraju: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సీఐ నాగరాజుకు బెయిల్‌ ఇవ్వొద్దు

Nov 17 2026 5:21 AM | Updated on Nov 17 2026 5:21 AM

CBI Opposes Bail Plea Of Suspended CI Nagaraju: Andhra Pradesh

సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన సీబీఐ, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి

సాయికృష్ణను సీఐ నాగరాజు తదితరులు అక్రమంగా నిర్బంధించారు

మానవ హక్కులను, చట్ట నిబంధనలను కాలరాశారు

రికార్డులను తారుమారు చేసి కోర్టులను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు

బెయిల్‌ ఇస్తే సాక్ష్యాల తారుమారే.. హైకోర్టుకు నివేదించిన సీబీఐ

సాక్షి, అమరావతి: విజయవాడలోని కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి సీఐ నాగరాజు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా నాగరాజు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలని సీబీఐ గట్టిగా వాదించింది. సీబీఐ తరఫు న్యాయవాది పీఎస్‌పీ సురేష్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘సాయికృష్ణ కస్టోడి­యల్‌ డెత్‌పై సీబీఐ ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించింది. 

పెండింగ్‌లో ఉన్న నాన్‌–బెయిలబుల్‌ వారెంట్ల అమలు పేరుతో కృష్ణలంక సీఐ, ఇతర పోలీసులు మృతుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా పోలీసు కస్టడీలో అక్రమంగా నిర్బంధించారు. తద్వారా మానవ హక్కులు, చట్ట నిబంధనలను కాలరాశారు. తీవ్ర శారీరక హింస కారణంగా సాయికృష్ణ పోలీస్‌ కస్టడీలో మృతి చెందాడు. ఆ తరువాత పోలీసులు అధికారిక రికార్డులను తారుమారు చేసి న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మృతుడి మృతదేహన్ని మాయం చేశారు.

దీనికి సీఐ నాగరాజు, ఇతర పోలీసులు ఇతరులు బాధ్యులు’ అని వివరించారు. సిట్‌ పూర్తి చార్జిషీట్‌ దాఖలు చేయడంలో విఫలమైందని, అందువల్ల తాను బెయిల్‌కు అర్హుడినని నాగరాజు చేస్తున్న వాదన అసంబద్ధం. చట్టబద్ధమైన గడువులోపు చార్జిషీట్‌ దాఖలు చేíసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది.

నాగరాజు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. కాబట్టి ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఆయనను బెయిల్‌పై విడుదల చేస్తే సీబీఐ ఇంకా నమోదు సేకరించాల్సిన పలు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఆయన బెయిల్‌పై విడుదలైతే విజయవాడ నగర పోలీస్‌ విభాగానికి చెందిన పలువురు అధికారుల పాత్ర వెలుగులోకి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇది కొనసాగుతున్న దర్యాప్తునకు తీవ్ర నష్టం కలిగిస్తుంది’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

చార్జిషీట్‌ చెల్లకుండా పోదు
సాయికృష్ణ తల్లి కూడా నాగరాజు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ కౌంటర్‌ దాఖలు చేశారు. ‘కీలక వాస్తవాలను దాచిపెట్టడం, ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలను మాయం చేయడం వంటి ఆరోపణల దృష్ట్యా, ఆయనను బెయిల్‌పై విడుదల చేస్తే స్వతంత్ర దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కీలక సాక్షులుగా ఉన్న పోలీసు సిబ్బంది, కిందిస్థాయి సిబ్బందిని ప్రభావితం చేసే లేదా బెదిరించే అవకాశం ఉంది. నా కుమారుడి మృతదేహం ఇంకా లభించలేదు.

దాని అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై సమగ్ర దర్యాప్తు అవసరం. ఈ పరిస్థితుల్లో సిట్‌ దాఖలు చేసిన చార్జిషీట్‌ అసంపూర్ణమైనదని నాగరాజు చేస్తున్న ప్రధాన వాదన పూర్తిగా అసమంజసం’ అని విజయలక్ష్మి తన కౌంటర్‌లో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement