breaking news
bail canceled
-
బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
-
కవితకు దక్కని ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు అక్రమమంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసులో రాజకీయ నేత ప్రమేయం ఉన్న కారణంగా చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని వ్యాఖ్యానించింది. పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలు మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసింది. కవిత పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు ప్రారంభిస్తూ.. హైకోర్టుకు వెళ్లాలని సూచించొద్దని, అనుకూలమైనా, ప్రతికూలమైనా సుప్రీంకోర్టు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏం జరుగుతోందో గమనించాలని, కవితకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని, ఒక అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా అరెస్టు చేశారని, ఇలా చేయడం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని చెప్పారు. అయితే, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. దీంతో, హేమంత్ సోరెన్ కేసులో ట్రయల్ కోర్టులో ఏమైందో చూశామని, ఇది జరిగే పని కాదని సిబల్ పేర్కొన్నారు. రాజకీయ వ్యక్తి ప్రమేయం ఉన్నందున చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని «బెంచ్ అభిప్రాయపడిందని జస్టిస్ సంజీవ్‌ఖన్నా తెలిపారు. ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా కవితకు సమన్లు జారీ చేశారని సిబల్ చెప్పగా, అయినప్పటికీ ఆర్టీకల్ 32 ప్రకారం బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు లేవనెత్తిన కారణంగా ఇప్పటికే విచారణలో ఉన్న విజయ్ మదన్‌లాల్ కేసుకు జత చేస్తామని పేర్కొంది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేస్తూ ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని పేర్కొంది. ‘నోటీసులు జారీ చేస్తున్నాం. ట్రయల్ కోర్టు లేదా ఇతర మార్గాల ద్వారా పరిష్కారానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పింస్తున్నాం. బెయిల్ అప్లికేషన్‌ను ట్రయల్ కోర్టు త్వరితంగా పరిష్కరించాలి’అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సిబల్ వ్యాఖ్యల్ని గమనించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా భావోద్వేగాలకు గురికావొద్దని సూచించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఇది స్వర్ణయుగం కాదన్న సిబల్ వ్యాఖ్యలకు జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. వేచి చూద్దామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విజయ్ మదన్‌లాల్ కేసు విచారణను జూలైలో చేపట్టనుంది. ఈ నేపథ్యలో ఇదే కేసుకు కవిత పిటిషన్ జత చేయడంతో తదుపరి విచారణ జూలైలోనే జరగనుంది. నేటితో ముగియనున్న కస్టడీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఈడీ కస్టడీ ఆదేశాలు శనివారంతో ముగియనున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నా రు. కాగా, ఈడీ కస్టడీలో ఉన్న కవితతో శుక్రవారం సాయంత్రం ఆమె కుమారుడు ఆర్య, మరదలు అఖిల, స్నేహితురాలు వినూత ములాఖత్ అయ్యారు. మరోవైపు, ఈడీ అధికారులు ఆరో రోజూ కవితను సుదీర్ఘంగా విచారించారు. -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత రచయిత వరవరరావు (80)కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త నవరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్నా తన భర్త ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తలోజా జైలులో అమానవీయ పరిస్థితుల్లో వరవరావు మగ్గుతున్నారని ఆమె వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన హక్కులను ఉల్లంఘనకిందికి వస్తుందన్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. -
వాళ్లకు బెయిల్ రద్దు చేయాలి: ఓవైసీ
- జీరో అవర్‌లో డిమాండ్ చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల నిందితుడు స్వామి అసీమానందకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనసభ జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మక్కామసీదు పేలుళ్ల ఘటనలో చాలా మంది అమాయక ముస్లింలు చనిపోయారని, దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేసి అసీమానందన దోషిగా తేల్చిందని గుర్తు చేశారు. ఒకవైపు కేంద్రం తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. అందరికీ సమన్యాయం చేస్తామని బహిరంగంగా చెబుతోందని, మరి ఈ విషయంలో హిందూత్వ శక్తులకు మాత్రమే రక్షణ సూత్రం వర్తింజేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మంజూరు చేసిన బెయిల్ రద్దయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కేసులు న్యాయ విచారణ చేసిన భాస్కర్‌రావు కమీషన్ నివేదికను సైతం ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక మక్కామసీదు అల్లర్లలో కాల్పులకు పాల్పడి కొందరి ముస్లింల మరణానికి కారణమైన అధికారే చిత్తూరు ఎస్పీగా ఉండి ఎన్కౌంటర్లకు పాల్పడ్డారని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ, అసీమానంద బెయిల్రద్దు చేసేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఎన్ఐఏ చేస్తున్న దర్యాప్తుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని నాయిని నర్సింహారెడ్డి అన్నారు.