మధుమేహులకు జపాన్ సైంటిస్టుల తీపి కబురు
మీల్ మేకర్, సోయా పాలు, పన్నీర్ తీసుకునే వారిలో కిడ్నీ సమస్యల ముప్పు తగ్గుముఖం
4,922 మంది టైప్–2 డయాబెటిస్ రోగులపై పరిశోధన
‘జర్నల్ ఆఫ్ డయాబెటిస్ ఇన్వెస్టిగేషన్’లో వివరాలు వెల్లడి
సాక్షి, అమరావతి: మధుమేహం (టైప్–2 డయాబెటిస్) బారినపడిన వారికి పొంచివున్న పెద్ద సమస్య మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులు. వీరు నిత్యం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు ఉన్నట్టు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
సోయా గింజలు, సోయా చంక్స్ (మీల్‌మేకర్), సోయా పన్నీర్, సోయా పాలు, పులియబెట్టిన సోయాతో కూడిన ఆహారం తీసుకునే మధుమేహ బాధితుల్లో కిడ్నీ పనితీరు తగ్గే ముప్పునుంచి బయటపడొచ్చని తేల్చి చెప్పారు. జపాన్‌లోని క్యుషు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హకుజ్యుజీ ఆస్పత్రి శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన వివరాలను జర్నల్ ఆఫ్ డయాబెటిస్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రచురించారు.
దాదాపు 5 వేల మందిపై అధ్యయనం
జపాన్‌లోని డయాబెటిస్ రిజిస్ట్రీలో నమోదైన 20 ఏళ్లు పైబడిన 4,922 మంది టైప్–2 డయాబెటిస్ రోగుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్య స్థితిగతులను శాస్త్రవేత్తలు లోతుగా విశ్లేíÙంచారు. జపనీయులు సంప్రదాయంగా తీసుకునే పులియబెట్టిన సోయా వంటకాలు (నాట్టో, మిసో సూప్), టోఫు ఆధారంగా ఈ పరిశోధన సాగింది. ఇవి మన భారతీయ వంటశాలల్లో వాడే ఉడికించిన/మొలకెత్తిన సోయా గింజలు, సోయా మీల్‌మేకర్, సోయా పన్నీర్, సోయా పొడి (సోయా పిండితో చేసిన రోటీలు) వంటి వాటికి సమానమైనవి.
సోయాలో ఉండే ‘ఐసోఫ్లేవోన్లు’ (జెనిస్టీన్, డైడ్జీన్ వంటి పోషకాలు), జంతు, వృక్ష సంబంధ ప్రోటీన్లు, పీచు పదార్థం, కూరగాయల పరిమాణాన్ని శాస్త్రవేత్తలు లెక్కించారు. కిడ్నీల పనితీరును అత్యంత కచి్చతంగా అంచనా వేయడానికి చేసే రక్తంలో సిస్టాటిన్–సి, అంచనా వేయబడిన గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ (ఈజీఎఫ్‌ఆర్) పరీక్షలు నిర్వహించారు. మూత్రంలో ప్రోటీన్ విసర్జనను పరీక్షించారు.
అల్బుమిన్ పోయే ప్రమాదమూ తక్కువే
అధ్యయనంలో భాగంగా సోయా ఆహారాలను తరచుగా తినేవారిలో కిడ్నీ పనితీరు మందగించే ప్రమాదం చాలా తక్కువగా ఉందని గుర్తించారు. సోయా ఉత్పత్తులను అసలు తీసుకోని వారిలో 21.2 శాతం మందికి కిడ్నీ పనితీరు తగ్గితే, రోజుకు కనీసం ఒక్కసారైనా సోయా ఆహారం తిన్నవారిలో ఈ శాతం కేవలం 9.2 మాత్రమే ఉండటం విశేషం.
సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్లను ఎక్కువగా తీసుకునే వారిలో కిడ్నీ పనితీరు మందగించే ప్రమాదం తక్కువగా నమోదైంది. మూత్రంలో అల్బుమిన్ పోయే సమస్య కూడా తక్కువగా ఉన్నట్టు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. సోయా ఆహారాలు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, కిడ్నీ వాపు వంటి వాటిని తగ్గించడంలో సహాయపడతాయని గత ప్రయోగాలు సూచిస్తున్నాయని పరిశోధకులు గుర్తు చేశారు.


