అభ్యర్థులకు డీఎస్సీ–2026 కష్టాలు
ఐదు జిల్లాల్లో ఒక్క పోస్టూ లేదు
16 జిల్లాల్లో పోస్టులు 10 లోపు మాత్రమే.. స్థానికేతర జిల్లాల్లో దరఖాస్తుకు నో–ఆప్షన్
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2026 దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపుతోంది. అధికారులు చేసిన తప్పిదాలు అభ్యర్థులను కష్టాల పాలుజేస్తున్నాయి. అర్హత ఉన్నా... నాన్–లోకల్ కోటాకు దరఖాస్తు చేసుకోకుండా చేశారు. తాజా నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులు చాలా తక్కువ. కేవలం 2,721 పోస్టుల్లో ఓ ఐదు జిల్లాల్లో ఒక్క పోస్టు కూడా లేదు. మరో 16 జిల్లాల్లో 10 లోపే ఉన్నాయి.
దీంతో నాన్–లోకల్ కోటా కింద దరఖాస్తుకు ప్రయత్నిస్తే కుదరడం లేదు. అభ్యర్థులు లోకల్, లేదా నాన్–లోకల్‌లో ఏదో ఒక్క జిల్లాను మాత్రమే ఎంచుకునేలా ఇచ్చారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ, డీఎస్సీ నిర్వహణ అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు.
అయితే, మెగా డీఎస్సీ–2025లో పోస్టుల ప్రిఫరెన్స్ ప్రయారిటీ దరఖాస్తు సమయంలోనే తీసుకున్న అధికారులు, వాటిని మార్చుకునే అవకాశం ఇవ్వలేదు. ఈసారి మెరిట్ లిస్టు విడుదలయ్యాక మార్కులు ఆధారంగా పోస్టుల ప్రాధాన్యం మార్చుకునేందుకు అవకాశం కల్పించారు.
నాన్–లోకల్ కోటాకు అర్హత లేదా?
తాజా నిబంధనల ప్రకారం లోకల్ కోటా పోస్టులు 95 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించారు. కేవలం 5 శాతం మాత్రమే నాన్–లోకల్ కోటాలో ఉన్నాయి. సాధారణంగా లోకల్‌లో పోటీ ఎక్కువ ఉన్నప్పుడు నాన్–లోకల్ కింద ఇతర జిల్లాల్లో దరఖాస్తు చేసుకుంటారు. ఈ క్రమంలో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఆధారంగా నాన్–లోకల్‌లో ఎన్ని జిల్లాలకైనా దరఖాస్తు చేసుకుంటారు.
ఇందుకోసం దరఖాస్తు సమయంలోనే అదనపు ఫీజు తీసుకుంటారు. కానీ, డీఎస్సీ–2026లో మాత్రం లోకల్ అభ్యర్థులు నాన్–లోకల్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా చేశారు. మరి ఈ ఐదు శాతం పోస్టులు ఎవరితో భర్తీ చేస్తారన్నది సమాధానం లేని పెద్ద ప్రశ్నగా మారింది. అసలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేనప్పుడు ఐదు శాతం నాన్–లోకల్ రిజర్వేషన్ ఎందుకిచ్చారో చెప్పడం లేదు.
నాడు అన్ని జిల్లాలకు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అభ్యర్థులు తమ సొంత జిల్లా(లోకల్)తో పాటు నాన్–లోకల్ కింద అన్ని జిల్లాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తాజా డీఎస్సీ దరఖాస్తు ఫీజును రూ.వెయ్యికి పెంచినా అవకాశాలు లేకుండా చేశారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


