భీమవరంలో బీజేపీకి ఝలక్ ఇచ్చిన టీడీపీ, జనసేన
మీ ముష్టి మాకొద్దంటూ కేంద్ర మంత్రి వర్మ తీవ్ర ఆగ్రహం
బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే పొత్తు కంటే ఎక్కువే గెలుస్తామని వ్యాఖ్య
సాక్షి, భీమవరం: భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి కూటమి పార్టీలు టీడీపీ, జనసేన ఝలక్ ఇచ్చాయి. భీమవరంలో 52 వార్డులకు తొలుత టీడీపీకి 24, జనసేనకు 23, బీజేపీకి ఐదు వార్డులతో పాటు మైనార్టీ కో–ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అనంతరం బీజేపీకి మరో వార్డు తగ్గించి కేవలం నాలుగు వార్డులకే పరిమితం చేసి.. టీడీపీ, జనసేన చెరో 24 వార్డులతో లోపాయికారిగా అభ్యర్థులను ప్రకటించుకోవడం కూటమిలో కుంపటి రాజేసింది.
‘మీరు ముష్టి వేస్తే.. మేం పోటీచేయాలా?’ అంటూ టీడీపీ, జనసేన నాయకత్వాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా రెండు పార్టీలు కలిసి వార్డులు పంచుకుని తమకు ముష్టి పడేస్తే పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో బీజేపీ లేదని స్పష్టం చేశారు.
తమకు కనీస సమాచారం ఇవ్వకుండా వార్డుల పంపకాలు చేయడం బీజేపీని అవమానించడమేనన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ప్రకటించారు. ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమేనని, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే పొత్తులో ఇచ్చే వార్డుల కంటే తాము ఎక్కువే గెలుస్తామని స్పష్టంచేశారు.
బీజేపీని పరిమితం చేసే కుట్ర
బీజేపీకి కేటాయించిన వాటిలో మూడు వార్డులు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఇంటి పరిసరాల్లోనివే కావడం గమనార్హం. బీజేపీని కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా ఆ రెండు పార్టీలు కలసి నిర్ణయించడం ఏమిటని మండిపడుతున్నారు.
బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ తనయుడికి వార్డు కేటాయించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉందంటున్నారు. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా నామినేషన్ల గడువు ముగిసే సరికి భీమవరంలో బీజేపీ నుంచి మొత్తం 36 నామినేషన్లు దాఖలు కాగా సోమవారం ఒక్క రోజే ఆరు దాఖలయ్యాయి.


