టీడీపీ ఉన్మాదం | TDP Leaders Attack On YSRCP Candidates in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ ఉన్మాదం

Nov 17 2026 4:52 AM | Updated on Nov 17 2026 4:52 AM

TDP Leaders Attack On YSRCP Candidates in Andhra Pradesh

పల్నాడు జిల్లా యల్లమంద సమీపంలో రోడ్డుపై రాడ్లు, కర్రలతో పచ్చమూకలు

తిరుపతి జిల్లాలో దళిత అభ్యర్థులపై హత్యాయత్నం

మహిళలపైనా దాడి.. ముగ్గురు అభ్యర్థులకు తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లాలో టీడీపీ అరాచకానికి పోలీసుల సహకారం 

వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధం.. యథేచ్ఛగా అభ్యర్థులపై దాడులు 

సంబేపల్లిలో నామినేషన్‌ వేసిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి పాలకేంద్రానికి నిప్పు 

నరసరావుపేట రూరల్‌ మండలంలో అభ్యర్థులపై టీడీపీ మూకల రాళ్లదాడి 

ప్రకాశం జిల్లాలో టీడీపీ గూండాలకు ఆర్‌ఓ, పోలీసులు వత్తాసు 

మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 వరకు వేచి ఉన్నా టోకెన్లు ఇవ్వని ఆర్‌ఓ 

మాజీ మంత్రి ఆదిమూలపు వేడుకున్నా.. బయటకు వెళ్లిపోవాలని హూంకరింపు 

పలు చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను నిర్బంధించిన పోలీసులు

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉన్మాదంతో ఊగిపో­తోంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకొనేందుకు గూండాలు, రౌడీలతో దాడులను కొనసాదిస్తోంది. సోమవారం చిత్తూరు జిల్లాలో ముగ్గురు దళిత అభ్యర్థులపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నామినేషన్లు వేయడానికి వచ్చిన అనేక మంది సర్పంచి, వార్డు అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు.

వారి చేతుల్లోని నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించేశారు. నామినేషన్‌ కేంద్రాల్లోకి చొరబడి, అక్కడా నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించేశారు. పోలీసులు కూడా అధికార కూటమి కోసమే అన్నట్లుగా పనిచేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతిపరులపై వేధింపులకు పాల్పడుతున్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ మూకల అరాచకాలను చూసీ చూడనట్లు వదిలేస్తూ, బాధితులపైన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపైనే కేసులు పెడుతున్నారు. పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లి నిర్బంధిస్తున్నారు. నామినేషన్ల సమయం ముగిసే వరకు పోలీసు వాహనాల్లో తిప్పుతున్నారు. 

రాప్తాడులో నామినేషన్‌ పత్రాలు చించి..
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోట సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కాంతప్పను ఎమ్మెల్యే సునీత అనుచరులు రామగిరి గ్రామం వద్ద అడ్డుకుని, నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించేశారు. వారిని బెదిరించి వెనక్కు పంపేశారు.

దళిత సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ పత్రాల చించివేత
వినుకొండ రూరల్‌ మండలం నీలగంగవరం గ్రామంలో సర్పంచ్‌ పదవికి దళితుడైన ఎనుముల యోహాను నామినేషన్‌ వేయడానికి కొత్తపాలెం వెళ్తుండగా టీడీపీ గ్రామ నాయకుడు ముత్తినేని సుబ్బారావు, ఆయన  అనుచరులు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చించివేశారు. ఈ విషయం మీడియాలో వైరల్‌ కావడంతో జిల్లా ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో మధ్యాహ్నం నామినేషన్‌ వేశారు.

బీజేపీ అభ్యర్థుల పైనా టీడీపీ గూండాయిజం
పచ్చ ఉన్మాదం మరింత పెరిగిన టీడీపీ నేతలు కూటమిలోని మిత్రపక్షమైన బీజేపీ నేతలపైనా దాడులకు దిగారు. వైఎస్సార్‌ జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న బీజేపీ సానుభూతిపరుడు రెడ్డప్పపై టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ గురిగింజకుంట శివప్రసాద్‌ నాయుడు దాడి చేశారు.

గాయపడిన రెడ్డప్ప ప్రస్తుతం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూలివీడు నామినేషన్‌ కేంద్రం వద్ద కూడా బీజేపీ మండల అధ్యక్షుడు హరినాధ్‌రెడ్డి, ఇతరులపై టీడీపీ నాయకులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

తొట్టంబేడులో దళిత అభ్యర్థులపై హత్యాయత్నం
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న దళిత అభ్యర్థులపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలతో హత్యాయత్నం చేశారు. సూరమాల పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన కర్లపూడి చిన్న జల్లి పాపయ్య సర్పంచ్‌ స్థానానికి, ఎం నాగరాజు, కార్తీక్‌ వార్డు మెంబర్లుగా నామినేషన్లు వేయడానికి తొట్టంబేడు రైతు సేవా కేంద్రానికి వెళ్లారు. అప్పటికే అక్కడ కత్తులు, కర్రలతో సిద్ధంగా ఉన్న 50 మందికి పైగా టీడీపీ గూండాలు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు.

ముగ్గురినీ తల, మెడపై తీవ్రంగా గాయపరిచారు. నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించిపడేశారు. అడ్డువచ్చిన మహిళల పైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దళిత నేతలను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు బాధితులను పరామర్శించారు. చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు బాలాజీ రెడ్డి వర్గీయులే ఈ  దాడి చేశారని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌చేయాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది గ్రామస్తులు శ్రీకాళహస్తిలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ధర్నా చేశారు.

తొట్టంబేడు మండలం జ్ఞానమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి రామచంద్రారెడ్డి నివాసంపై సోమవారం సాయంత్రం టీడీపీ గూండాలు దాడి చేసి, నామినేషన్‌ పత్రాలు చించేశారు.

చిత్తూరుజిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో బందార్లపల్లి గ్రామం 5వ వార్డుకు నామినేషన్‌ వేసేందుకు గోరివిమాకులపల్లి గ్రామ స్వర్ణ భవనానికి వెళుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు యల్లమ్మ సోమశేఖర్‌ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆమె చేతిలోని నామినేషన్‌ పత్రాలను టీడీపీ మద్దతు అభ్యర్థి పుష్ప నాగరాజు లాక్కుని చింపేసే ప్రయత్నం చేయబోగా, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతిఘటించారు. అతి కష్టంమీద యల్లమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు. కానీ పోలీసులు వెంటనే యల్లమ్మ భర్త సోమశేఖర్‌ను అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు.

అన్నమయ్య జిల్లాలో అదే అరాచకం
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నామినేషన్‌ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కొప్పుల చంద్రయ్య పాల కేంద్రంపై టీడీపీ మూకలు సోమవారం దాడి చేశాయి. ఇందిరానగర్‌లోని ఆయన పాల కేంద్రంలోకి సోమవారం తెల్లవారుజామునే టీడీపీ గూండాలు చొరబడి పాల క్యాన్లకు నిప్పంటించారు. రాయచోటి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో టీడీపీ గుండాలు సోమవారమూ అరాచకం సృష్టించారు.

వారికి సహకరించిన పోలీసులు ముందుగానే వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, రమేష్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జల్లా సుదర్శన్‌ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇదే అదునుగా టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు కొనసాగించారు.

రామాపురం మండలం హసనాపురంలో నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై రాళ్లతో దాడి చేశారు. అయినా, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపైనే పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టి వేధించడం గమనార్హం. అరవీడులో నామినేషన్లు వేసేందుకు వస్తున్న అభ్యర్థులను పోలీసులే అడ్డుకున్నారు.

పోలీసు వాహనాల్లో రాత్రి వరకు తిప్పి వదిలిపెట్టారు. సంబేపల్లి మండలం గుట్టపల్లి గ్రామం అంకిరెడ్డిగారిపల్లె నామినేషన్‌ కేంద్రానికి వస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి శివప్రసాద్‌ నాయుడును ఎస్‌.సోమవరం వద్ద టీడీపీ మూకలు కొట్టి, బైక్‌ను ధ్వంసం చేశారు. సంబేపల్లి పంచాయతీ ఒకటో వార్డు అభ్యరి్థగా నామినేషన్‌ వేయడానికి వచి్చన మండ్ల శివ తులసిని అడ్డుకొని, వెనక్కి పంపేశారు.

నామినేషన్‌ పత్రాలు చించేసిన ‘పచ్చ’ గూండాలు
నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ 24, 25, 26 వార్డులకు నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు చిల్లకూరు రమణయ్యను టీడీపీ గూండాలు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చించివేసి, అక్కడి నుంచి తరిమేశారు. మరో అభ్యర్థి మల్లి రమేష్‌ భార్య నామినేషన్‌ కేంద్రానికి వెళ్లగా అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో పోలీసులు ఆమెను, ఆమె భర్తను  ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. దీంతో ఆమె నామినేషన్‌ వేయలేకపోయారు. మిగతా అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అక్కడే తిష్ట వేశారు.

ప్రకాశం జిల్లాలో నామినేషన్లను అడ్డుకున్న పచ్చనేతలు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని కాకర్ల, జువ్విగుంట సచివాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వారికి ఆర్‌ఓ, పోలీసులు వత్తాసు పలికారు. దీంతో సోమవారం సాయంత్రం 5 వరకు కూడా ఆరుగురు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు నామినేషన్‌ పత్రాలతో పడిగాపులు కాశారు. అయినా ఆర్‌ఓ రెబ్బా వెంకటేశ్వర్లు వారికి టోకెన్లు ఇవ్వకుండా బయటకు పంపేశారు.

ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ కాకర్ల స్వర్ణ సచివాలయం వద్దకు వచ్చి, టోకెన్లు ఎందుకు ఇవ్వలేదని ఆర్‌ఓను నిలదీశారు. నామినేషన్లు తీసుకోవాలని దండం పెట్టి వేడుకొన్నా ఆర్‌ఓ అంగీకరించలేదు. బయటకు వెళ్లిపోవాలని హూంకరించారు. దీంతో సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిమూలపు సురేష్, అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రం ముందు నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement