సమయానికి ఉన్న సరుకులతో వండివార్చుతున్న కేటరింగ్ సిబ్బంది
గురుకులాలు, కేజీబీవీల్లో అమలు కాని మెనూ
సకాలంలో సరుకులివ్వని కాంట్రాక్టర్
నిలిచిన పప్పు సరఫరా.. పప్పు కూర, పప్పుచారు బంద్
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బోండా, బజ్జీ, పూరి నిలిపివేత..
రాష్ట్రవ్యాప్తంగా గాడి తప్పిన సరుకుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం టిఫిన్, భోజనం అందడం లేదు. నూరుశాతం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం ప్రత్యేక మెనూ రూపొందించి ఆదేశించినా, సరుకుల కొరత కారణంగా ఆహార పంపిణీ గాడి తప్పింది. ఏపూటకాపూట అందుబాటులో ఉన్న సరుకులతో వండివార్చుతున్నారు. విద్యా సంస్థల్లో డిమాండ్‌కు తగిన సరుకుల ఇండెంట్ ప్రతి నెలా ముందస్తుగా సమర్పిస్తున్నా, ఆ మేరకు సరుకులు పంపిణీ చేయడంలో కాంట్రాక్టర్లు విఫలమవుతున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో సరుకుల పంపిణీకి ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్‌మెంట్, ప్రాసెసింగ్ అండ్ రీటెయిలింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాకాఫ్) కాంట్రాక్టు బాధ్యతలు స్వీకరించింది. కనీసం పక్షం రోజుల ముందే క్షేత్రస్థాయి నుంచి విద్యా సంస్థల వారీగా ఇండెంట్ సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన డిమాండ్ అధికారులు సమర్పించినా, కాంట్రాక్టు సంస్థ పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైంది. అక్టోబర్ నెలలో కొన్నిచోట్ల అరకొరగా సరుకులు పంపిణీ చేయగా, నవంబర్‌లోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. దీంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకుండా... అందుబాటులో ఉన్నవాటితో సరిపెడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సోమ రాజేశ్వర్ ఏకంగా కాంట్రాక్టు సంస్థకు లేఖ రాస్తూ.. పదిరోజుల్లోగా డిమాండ్‌కు సరిపడా సరుకులన్నీ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
బోండా, బజ్జీ, పూరి బంద్... బూస్ట్, బిస్కెట్, చిక్కిలకు బ్రేక్
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్లలో వంట సరుకుల పంపిణీకి ఈ ఏడాది కేంద్రీకృత విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2026–27 విద్యాసంవత్సరానికి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వంట కోసం అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరా బాధ్యతను నాకాఫ్‌కు ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్ (పీఎంయూ) అప్పగించింది.
విద్యార్థులకు ఉదయం పూట బూస్ట్‌తో కూడిన పాలు ఇస్తారు. కొన్నిచోట్ల టీ కూడా ఇస్తున్నారు. బూస్టు, టీ పౌడర్, పంపిణీ కాకపోవడం, కొన్నిచోట్ల చక్కెర కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులకు ఈ మేరకు కోత పడింది.
ఉదయం పూట ఇచ్చే టిఫిన్లకు మైదా పంపిణీ కాకపోవడంతో బోండా, బజ్జీ, పూరి పూర్తిగా నిలిచిపోయింది. దీనికి బదులుగా ఉప్మా మాత్రమే ఇస్తున్నారు.
సాయంత్రం పూట ఇచ్చే చిరుతిళ్లలో చిక్కి (పల్లీపట్టి) ఇస్తుండగా, ఇప్పుడు స్నాక్స్ ఎగ్గొడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
రాష్ట్రంలోని చాలా చోట్ల కందిపప్పు సరఫరా లేదు. దీంతో పప్పు కూర, పప్పు చారు నిలిచిపోయింది. ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 40 శాతం సరుకుల సరఫరా ఆగినట్లు సిబ్బంది చెబుతున్నారు.
సరుకుల సరఫరా నిర్లక్ష్యంపై మంత్రి అడ్లూరి తీవ్ర ఆగ్రహం
గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు యూనిఫాంతో పాటు ప్రొవిజన్స్, ఇతర వస్తువుల పంపిణీ బాగా వెనుకబడి ఉండడంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురుకులాలకు సరఫరా చేస్తున్న ప్రతి వస్తువు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, సరఫరా చేసిన వస్తువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? వాటిని పరిశీలించి ధ్రువీకరిస్తున్న అధికారులు ఎవరు? ప్రతి విద్యాసంస్థలో సరుకుల స్వీకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అనే అంశాలపై అన్ని శాఖల అధిపతులు (హెచ్‌ఓడీలు) సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి జిల్లా నుంచి నోడల్ అధికారి నివేదిక ఇవ్వాలని, బఫర్ స్టాక్ తప్పనిసరి నిర్వహించాలన్నారు. ఈనెల 25వ తేదీ నాటికి స్పష్టమైన పురోగతితో నివేదిక ఇవ్వాలని, ఆరోజున సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు.
ఇదీ చదవండి: గ్రీన్‌కార్డ్ కలలో కరుగుతున్న కాలం!


