breaking news
bc hostal
-
మరో మూడు బీసీ హాస్టళ్ల మూసివేత..!
కలెక్టర్కు నివేదిక అందజేసిన అధికారులు ఆరుకు చేరిన సంఖ్య హన్మకొండ అర్బన్: విద్యార్థులు లేని కారణంగా గత ఏడాది మూడు బీసీ హాస్టళ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరో మూడింటికి కూడా తాళం వేసేందుకు సిద్ధమయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఒక్క విద్యార్థి కూడా బీసీ హాస్టళ్లలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వాటిని మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు కలెక్టర్కు నివేదిక పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాగానే బచ్చన్నపేట, మహ బూబాబాద్, నల్లబెల్లి మండలంలోని నాచినపల్లి బీసీ బాలుర హాస్టళ్లను అధికారులు మూసివేయనున్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది జిల్లాలోని మూడు హాస్టళ్లను విద్యార్థులు లేక మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు హాస్టళ్లు కూడా మూతపడేందుకు సిద్ధంగా ఉండడంతో వాటి సంఖ్య ఆరుకు చేరినట్లయింది. కాగా, జిల్లాలోని మరికొన్ని హాస్టళ్లలో కూడా ప్రసుత్తం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఈ సంఖ్యను పెంచుకునేందుకు వార్డెన్లకు ఈ నెలాఖరువరకు కలెక్టర్ గడువు విధించారు. నెలాఖరు తర్వాత కూడా విద్యార్థుల సంఖ్య కనీసం 30 మందికి దాటకుంటే వాటిని కూడా మూసివేసి ఉన్న వారిని పక్క హాస్టళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మరో ఐదు నుంచి ఆరు వసతిగృహాలు కూడా మూత పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మూతపడుతున్న హాస్టళ్లలోని వార్డెన్లు, వర్కర్లను ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్న చోటకు సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
కళేబరం ఉన్న నీటితో వంటలు: హాస్టల్లో ఆకలి కేకలు
రాజాం (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా రాజాం బస్డాండ్ వెనుక ఉన్న బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థినులు నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు వంట వండకపోవడంతో విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డెక్కారు. హాస్టల్లో వంట వండటానికి పక్కనున్న బావి నుంచి నీళ్లు ఉపయోగించేవారు. నాలుగు రోజుల క్రితం బావిలో ఓ పిల్లి పడి చనిపోయింది. దాంతో పాటు మోటారు పాడైంది. అయితే మోటారును బాగుచేసినా నీటిలో ఉన్న పిల్లి కళేబరం అలానే ఉంది. నీటిని శుద్ధి చేయకపోవడంతో వాటితోనే వండిన వంటలు.. దుర్వాసన వచ్చాయి. దీంతో పిల్లలు తినలేక పోతున్నారు. నీటిని శుద్ధిచేసి మంచినీటితో వండితేనే తింటామని భీష్మించారు. దాంతో ఆగ్రహించిన వార్డెన్ వంట వండేది లేదని తేల్చిచెప్పడంతో అప్పటినుంచి డబ్బున్న వాళ్లు హోటళ్లలో తింటుండగా డబ్బులు లేనివారు ఆకలితో పస్తులున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు సోమవారం మధ్యాహ్నం హాస్టల్ విద్యార్థినులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని విచారించి చర్యలు తీసుకుటామని హామీ ఇచ్చారు.