జనీవా: ఇటీవల భారత్‌లో వెలుగు చూసిన నిపా వైరస్ కేసులు అరుదైనవే అయినప్పటికీ, ఇవి అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) డైరెక్టర్ జనరల్ డాక్లర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. ఈ వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కేవలం భారతదేశానికే పరిమితమైందని, ఇతర దేశాల్లో ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో నమోదైన నిపా కేసులు ప్రజారోగ్యానికి సవాలుగా మారవచ్చని, వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని టెడ్రోస్ సూచించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఇద్దరు నర్సులకు నిపా వైరస్ సోకినట్లు ధృవీకరించారు. 1998లో ఈ వైరస్‌ను తొలిసారిగా గుర్తించినప్పటి నుండి రాష్ట్రంలో ఇది మూడవసారి సంభవించిన వ్యాప్తి అని టెడ్రోస్.. సోషల్ మీడియా వేదికగా తెలిపారు. బాధితులతో సన్నిహితంగా ఉన్న సుమారు 190 మందిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతానికి ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించలేదని ఆయన వెల్లడించారు.
బాధితుల్లో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మరొకరు ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని టెడ్రోస్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం, స్థానిక ఆరోగ్య శాఖ ఇప్పటికే నిఘా పెంచినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వివరించారు. ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను కూడా పెంచారు. ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే, ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే అంతర్జాతీయ ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల నుండి లేదా కలుషితమైన ఆహారం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయని, ఇవి సాధారణ జ్వరాల మాదిరిగా ఉండటంతో గుర్తించడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మెదడు వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరణాల రేటు కూడా 40 శాతం నుండి 75 శాతం వరకు ఉండే ప్రమాదం ఉందని, అందుకే వ్యాధి రాకుండా నివారణ మార్గాలను అనుసరించడమే ఉత్తమమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
ఇది కూడా చదవండి: ‘నీట్’ కోసం ‘ఎన్ఆర్ఐ’లుగా మారి.. మరో బాగోతం


