రైతులు భూమి అమ్ముకోవద్దు.. పోరాటం చేయాలి
భూమి ధరల పెంపు ముఖ్యం కాదు, ఉత్పత్తుల గిట్టుబాటు ధర కావాలి
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తాం
ఈ నెల 26న రైతాంగ ఉద్యమ కార్యక్రమాలు; 27న ‘చక్కా జామ్’
‘సాక్షి’ ఇంటర్వ్యూలో సంయుక్త కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘ప్రస్తుతం రైతు పండించిన పంటకు సరైన ధర రావడం లేదు. మధ్యలో వ్యాపారస్తులు దోచుకుంటున్నారు. రైతు దగ్గర తక్కువకు కొని, వినియోగదారునికి ఎక్కువకు అమ్ముతున్నారు. తద్వారా అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నారు. మధ్యలో వ్యాపారి లాభ పడుతున్నారు. ఇది పోవాలంటే మినిమమ్ సపోర్టు ప్రైస్‌కు (ఎంఎస్‌పీ) చట్టబద్ధత రావాలి.
కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరో రైతు ఉద్యమం చేస్తాం. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా సిద్ధం కావాలి’అని జాతీయ రైతు ఉద్యమ నేత, సంయుక్త కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహా సభల్లో పాల్గొనేందుకు సోమవారం ఆయన నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
చట్టబద్దత వస్తేనే రైతులకు మేలు
‘ఎంఎస్పీకి చట్ట బద్దత వస్తేనే రైతులు పండించిన పంటలకు కనీస ధరకు హామీ లభిస్తుంది. తద్వారా దానికంటే తక్కువ ధరకు కొనలేరు. ప్రస్తుతం దేశంలో 80 శాతం మంది చిన్న, మధ్య తరగతి రైతులే. ఎంఎస్పీ చట్టబద్ధతతో వారందరికి మేలు జరుగుతుంది. పెరుగుదల భూమి ధరలో కాదు.. పంటలో ఉండాలి. పంట ధర పెరిగితేనే రైతు ఆదాయం పెరుగుతుంది. అందుకే పంటను అమ్ముకోవాలి తప్ప భూమిని అమ్ముకోవద్దు. భూమి పోతే రైతు మళ్లీ కూలీ అవుతాడు’
26, 27 తేదీల్లో రైతాంగ ఉద్యమ కార్యక్రమాలు
‘రైతుల ఆదాయం పెంచుతామని హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయడం లేదు. బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలి. అందులో భాగంగా ఈనెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా రైతాంగ ఉద్యమం చేపడ్తాం. ఆ రోజు ఆందోళన స్థలాల్లోనే బస చేసి నిరసన తెలియజేస్తాం. 27వ తేదీన ‘చక్కా జామ్’నిర్వహిస్తాం’
కౌలు రైతుల కోసం
‘కౌలు రైతుల హక్కుల కోసం పోరాటం చేయాలి. వారికి ఎంఎస్పీ దక్కడం లేదు. బీమా, నష్ట పరిహారం అందడం లేదు. రైతులు తమ పత్రాలను ఇస్తే భూమిని కోల్పోతామని భయపడుతున్నారు. ఈ భయం పోగొట్టాలి. సామాజిక ఉద్యమం ద్వారా దీన్ని సాధించాలి. కౌలు రైతుతో సహా అందరూ ఏకం కావడానికి ఉద్యమం జరగాలి’
ఫసల్ బీమా యోజన అమలులో వైఫల్యం
‘మోదీ సొంత జిల్లాలో, సొంత రాష్ట్రంలో కూడా ఫసల్ బీమా యోజన పథకం అమలు కావడం లేదు. దానిని జిల్లా స్థాయిలో నిర్వహించే అధికారి అంటూ ప్రత్యేకంగా లేరు. రైతుకు ఎవరిని కలువాలో కూడా తెలియదు. జిల్లానే కేంద్రంగా అమలు చేయాలని చెప్పాం. అయినా అమలు కావడం లేదు’
ఇదీ చదవండి: సీలింగ్ భూమిని ‘కొల్ల’గొట్టారు!


